పురపాలన దేశానికే ఆదర్శం

– పట్టణాల నుంచే 70శాతం ఆదాయం
– అందుకే అప్పులు తెచ్చి మౌలిక వసతుల కల్పన
– పదేండ్లలో కేంద్రం ఇచ్చింది కేవలం రూ.9వేల కోట్లే… : పురపాలకశాఖ వార్షిక నివేదికల విడుదలలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని పురపాలక సంస్థల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉందని ఆ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణకు 70 శాతం ఆదాయం పట్టణాల నుంచే వస్తున్నదనీ, అందుకే అప్పులు తెచ్చి మరీ అక్కడ మౌలిక సౌకర్యాలపై పెట్టుబడులు పెడుతూ స్థిరాస్తుల్ని పెంచుతున్నామని వివరించారు. శుక్రవారంనాడి క్కడి మెట్రోరైల్‌ ప్రధాన కార్యాలయంలో 2014 నుంచి 2023 వరకు పురపాలకశాఖ వార్షిక నివేదికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేండ్ల అభివృద్ధి ప్రజల కండ్లముందే ఉన్నదనీ, దాన్ని గుర్తించి వచ్చే ఎన్నికల్లో స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి ఇప్పటిదాకా పురపాలక శాఖ ఖర్చు చేసిన అన్ని అంశాలు ఈ నివేదికల్లో ఉన్నాయని తెలిపారు. నివేదికలు ఇవ్వాలనీ ఎవరూ అడగలేదనీ, అయినా ప్రభుత్వ చిత్తశుద్ది, పారదర్శకత ప్రజలకు తెలియాలనే ఏటా నివేదికలు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకే అహ్మదాబాద్‌ తరహాలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో మున్సిపల్‌ బాండ్ల రూపంలో నిధులు సేకరించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగుందికాబట్టే, కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి అవార్డులు ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పించామని చెప్పారు. పట్టణాల్లో ప్రజా రవాణాను మెరుగుపర్చడం, మెట్రోరైల్‌ విస్తరణ, ఎలక్ట్రిక్‌ బస్సులు, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమత్తు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఐదుగురు కేంద్ర మంత్రులు మారినా నగరంలో ప్రజారవాణాకు అవసరమైన రక్షణశాఖ భూములు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. శామీర్‌పేట, మేడ్చల్‌వైపు డబుల్‌ డెక్కర్‌ స్కైవేలు కడతామన్నారు. మెట్రో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా బోగీల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జలమండలి ద్వారా సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నిర్మిస్తున్నామనీ, కొండపోచమ్మ నుంచి హైదరాబాద్‌కు నీరు తెచ్చి, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలో రింగ్‌ మెయిన్‌ పూర్తిచేస్తామని వివరించారు. పురపాలకశాఖ 2014-2023 మధ్య కాలంలో మొత్తం రూ. 1,21,294 కోట్ల నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. దీనిలో రూ.1,11,360 కోట్లు (91.8శాతం) రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాగా, కేవలం రూ. 9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి రాజ్యంగబద్దంగా దక్కాల్సిన పథకాల ద్వారా వచ్చాయని అన్నారు. అంతకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా పట్టణాభివృద్ధికి రాలేదని విమర్శించారు.
ఈ సందర్భంగా వివిధ పథకాల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, పురపాలకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ దానకిషోర్‌, హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎమ్‌డీ ఎన్వీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.