నవతెలంగాణ – దుబ్బాక
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే దుబ్బాక మున్సిపల్ అన్ని విధాల అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదవుతున్నా.. నిధులు మంజూరు చేయడం లేదని, పట్టణాలు, గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడుతున్నాయని విమర్శించారు. ఆదివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ రెండో వార్డులో 15 వ ఫైనాన్స్ నిధులు రూ.3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు, ప్రాథమిక పాఠశాలలో ఏఏపీసీ నిధులు రూ.6,68,137 తో నిర్మించనున్న కిచెన్ షెడ్ పనులకు, చెల్లాపూర్- రాజక్కపేట వెళ్లేదారిలో రూ.13 లక్షలతో ఏర్పాటు చేసిన వెల్కమ్ ఆర్చ్ లను, అలాగే లచ్చపేటలోని 10 వ వార్డులో వార్డు ఆఫీసు,గంగపుత్ర సంఘం, పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్స్ రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న కూరగాయల మార్కెట్ షెడ్ల నిర్మాణ పనులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, 2, 10 వార్డుల కౌన్సిలర్లు గోనెపల్లి దేవలక్ష్మి, కూరపాటి బంగారయ్య తో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్, 11 వ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీజ శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, రొట్టె రాజమౌళి, మాజీ జెడ్పీటీసీ కడ్తాల రవీందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.