రసభసగా మున్సిపల్ సమావేశం..

Municipal meeting as Rasabhasaga..– అర్దాంతరంగా సమావేశం రద్దు
– రద్దు చేసిన కౌన్సిల్ పట్ల బీజేపీ, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల కార్పొరేటర్ల నిరసన
– మేయర్ చాంబర్ ముందు ఆందోళన
– బల్దియాలో తీవ్ర ఉద్రిక్తత
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగర పాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది. సమావేశంలో ఎలాంటి తీర్మాణాలు చేయకుండా ముగించడం పట్ల బిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు మేయర్ నీతు కిరణ్, కమిషనర్ దిలీప్ కుమార్ చాంబర్ ల ముందు బైటాయించిన ఆందోళనకు దిగారు.పోలీసుల బందోబస్తు మధ్య సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడంతో కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ప్రధానంగా చివరి సమావేశంలో ఎలాంటి చర్చ జరగపోవడంపై కార్పొరేటర్లు మేయర్, కమిషనర్ తీరు పట్ల మండిపడ్డారు. అంతకు ముందు గత ఐదేళ్ల బల్దియా పాలనపై నివేదకను స్వయంగా మేయర్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా 39 అంశాలపై సభ్యుల మద్దతుతో ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు ఐదేళ్ల కాలం సహకరించిన ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ కార్పొరేటర్లకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఏకంగా కౌన్సిల్లో తమను మాట్లాడనించడం లేదంటూ మేయర్ ఛాంబర్ తలుపులను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లతో చాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ రోడ్లపై కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే వారిపై మున్సిపల్ సిబ్బంది, పోలీసులు వేదించడం దారుణమని వీటిని అడ్డుకోకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టకుండా కౌన్సిల్ సమావేశాన్ని ఎలా బహిష్కరిస్తారంటూ ప్రశ్నించారు.
ఎజెండాపై చర్చ జరగాలని బీజేపీ నిరసన…
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చివరి జనరల్ బాడీ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమావేశాన్ని అర్థాంతరంగం ముగించడంతో వారు నేలపై కూర్చుండి నిరసన తెలిపారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు నిరసన తెలిపారు. సమస్యలపై చర్చించకపోవడం సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు.
వీధి వ్యాపారుల కోసం ఎంఐఎం కార్పొరేటర్ల నిరసన…
నిజామాబాద్ నగరంలోని అంగడి బజార్ లో వీధి వ్యాపారుల విక్రయాలకు కౌన్సిల్ లో తీర్మాణం చేయాలని కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లు మేయర్ చాంబర్ ఎదుట నేలపై కూర్చుండి నిరసన తెలిపారు. నగరంలో ఫుట్ పాత్ లను కబ్జాలు చేసి దందాలు నిర్వహిస్తుంటే పట్టించుకోని మున్సిపల్, పోలీసులు వీధి వ్యాపారులపౌ జులం ప్రదర్శిస్తున్నారని నిరసన తెలిపారు. పేదలు తమ పొట్టకూటి కోసం 3యాలు చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.