సమస్యల పరిష్కారం కొరకు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి

Municipal office siege for problem solvingనవతెలంగాణ – కంటేశ్వర్  
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు కనుగొనంగా సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలని డిమాండ్లతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్  ఔట్సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం బైఠాయించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో మున్సిపల్ యూనియన్ గౌరవాధ్యక్షులు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన సూచన ప్రకారం నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలన్నారు. అదేవిధంగా కేటగిరీల వారీగా వేతనాలను ఇవ్వాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ సంస్థల్లో పని చేసే కార్మికులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు ధరలు పెరుగుతా ఉంటే కార్మికులు తమ వేతనాలు పోకపోవటంతో అప్పులు చేసి బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు.
స్థానికంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అనేకసార్లు మున్సిపల్ కమిషనర్ కి అధికారులకు తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు నెలనెలా ఇవ్వాల్సిన సబ్బులు,నూనెలు, సంవత్సరానికి రెండు జతలు చెప్పులు బట్టలు ఇవ్వటంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారని బట్టలు కుట్టుకూలీ కూడా ఇవ్వటం లేదని ఆయన విమర్శించారు. అదేవిధంగా చనిపోయిన కార్మికులకు రూ.20000 రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు జరపటం లేదని ఇప్పటికీ, కార్పొరేషన్ పరిధిలో 25 మంది కార్మికులు చనిపోయారని తెలిపారు. ఇతర అనేక కార్పొరేషన్లు శానిటేషన్ ఉన్న డ్రైవర్లకు ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయలను అమలు జరుపుతున్నప్పటికీ నిజామాబాద్ నగర కార్పొరేషన్ మాత్రం అమలు జరపటం లేదని ఇది కార్మికుల పట్ల వివక్షతే అవుతుందని అన్నారు. అధికారులు  కార్మికుల పట్ల వైఖరి మారాలని సమస్యలను ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. సమస్యలను పరిష్కరించని ఎడల తమ పోరాటాన్ని మరింత మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భూపతి, ఏక్ నాథ్, సంతోష్ సింగ్, మోహన్, సూర రవి,  గంగ శంకర్, శ్రావణ్, వెంకటేష్, మహేష్, సదానంద్, లక్ష్మణ్, నరేష్, సంతోష్ గౌడ్, ఎల్లయ్య, రాము, వినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.