– దశలవారీ పోరాటాలకు పిలుపు సీఐటీయు జిల్లా కార్యదర్శి బస్వరాజ్
నవతెలంగాణ-మెదక్
మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి సమ్మె బాట పడుతున్నట్లు సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి బి. బస్వరాజ్ తెలిపారు. శనివారం మెదక్ పట్టణంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్వరాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ యూనియన్ల ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి పురపాలక శాఖ మంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, మున్సిపల్ డైరెక్టర్ కు గత 14 రోజుల ముందుగానే సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తప్పని పరిస్థితుల్లో తమ హక్కుల సాధన కోసం మున్సిపల్ కార్మికులు సమ్మె బాట చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్వహరించడం వల్లనే కార్మికులు సమ్మెలోకి వెళ్లేందుకు కారణమైందన్నారు. పర్మినెంట్ చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్మికులను పర్మినెంట్ చేసే వరకు ఈ పోరాటం తప్పదన్నారు. ఎంతో దయనీయ స్థితిలో ఉన్న మున్సిపల్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం చాలీచాలని వేతనాలు ఇస్తుందన్నారు. తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా పట్టణ ప్రజలకు చెత్త లేకుండా రోడ్లను పరిశుభ్రంగా చేసి ప్రజల ఆరోగ్యలను కాపాడుతున్నామన్నారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనికి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి నోటి నుంచి ‘సఫాయి అన్నకు సలాం’ అన్న మాటను మర్చిపోయారా అని గుర్తు చేశారు. తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయడం లేదన్నారు. మొదటి పిఆర్సిలో ఉన్న బకాయిలు, నాలుగు నెలల ఏరియర్స్ కార్మికులకు రావాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గుర్తింపు కార్డులు కావాలన్నా, సబ్బులు, నూనెలు డ్రస్సులు, ఇవ్వాలన్నా పాలకవర్గం, చైర్ పర్సన్‌ల దష్టికి, స్థానిక కమిషనర్ దష్టికి తీసుకెళ్లినా ఇవ్వడం లేదన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించి, మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టే ఎన్నో అభివద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఉంటాయని, మున్సిపల్ కార్మికులకు రావాల్సిన బకాయిలు, కార్మికుల సంక్షేమం కోసం మాత్రం ఒక్క రూపాయి మున్సిపాలిటీ నిధుల నుండి ఖర్చు చేయడం లేదన్నారు. 10 సంవత్సరాలలో దాదాపు 20 మంది కార్మికులు చనిపోతే ఈపీఎఫ్, ఇయస్‌ఐ నుంచి కార్మికులకు వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. కార్మికులందరికీ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. నాగరాజు, గోపాల్, పద్మారావు, ప్రశాంత్, రాజశేఖర్, శంకర్, తదితరులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.