మురిసిన యు ముంబా

Murisina U Mumba– 39-37తో జైపూర్‌పై గెలుపు
– ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11
నవతెలంగాణ-హైదరాబాద్‌
మాజీ చాంపియన్ల పోరులో యు ముంబా పైచేయి సాధించింది. 39-37తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై రెండు పాయింట్ల తేడాతో యు ముంబా మెరుపు విజయం సాధించింది. గురువారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లో యు ముంబా రెయిడర్‌ అజిత్‌ చౌహాన్‌ (14 పాయింట్లు) సూపర్‌ టెన్‌ షోతో అదరగొట్టడంతో ఆ జట్టు పీకెఎల్‌ 11వ సీజన్లో రెండో విజయం సాధించింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తరఫున నీరజ్‌ నర్వాల్‌ (12 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి. మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీపై పట్నా పైరేట్స్‌ 44-30తో ఏకపక్ష విజయం సాధించింది. దేవాంక్‌ (12 పాయింట్లు), అయాన్‌ (12 పాయింట్లు) కూతలో అదరగొట్టారు. 14 పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్‌ తిరుగులేని విజయం నమోదు చేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు బెంగళూర్‌ బుల్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనుంది.