నిర్దిష్ట కాల వ్యవధిలో దేశం సంస్కృతి, వారసత్వ అభివృద్ధికి మ్యూజియాలు రుజువులుగా ఉంటాయి. ఇవి ఒక దేశ సంస్కృతికి భాండాగారం లాంటివి. అసలు మ్యూజియమంటే ముందు తెలుసుకోవాలి. 24 ఆగస్టు 2022న హేగ్ నగరంలో ఉన్న అంతర్జాతీయ మ్యూజియం కౌన్సిల్ (ఐకాం – ఐసిఒయం) సాధారణ సభ 92.41శాతంతో కొత్త మ్యూజియం నిర్వచనాన్ని తెలిపింది. సమాజ సేవలో పరిశోధిస్తూ, సేకరిస్తూ, పరిరక్షిస్తూ, అర్థం చేసుకుంటూ ప్రత్యక్షమైన కనిపించని వారసత్వాన్ని ప్రదర్శించే లాభాపేక్ష లేని శాశ్వత సంస్థను మ్యూజియం అంటారు. 1946లో స్థాపించబడిన ఐకాం తన అంతర్జాతీయ ప్రజాసేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, ఇంటర్‌పోల్, ప్రపంచ కస్టమ్స్ సంస్థ వంటి సంస్థలతో సంబంధాలున్నాయి. ఇందులో సాంస్కృతిక వస్తువులు, అక్రమ రవాణాపై పోరాటం, సహజ లేదా మానవ నిర్మిత విపత్తుల సందర్భంలో ప్రపంచ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం, ప్రమాద నిర్వహణ అత్యవసర సంసిద్ధతను ప్రోత్సహించడం లాంటివి ఉన్నాయి. ఐకాం సాంస్కృతిక మార్పిడి, అభివృద్ధిలో మ్యూజియంల పాత్రను ప్రోత్సహించడానికి ప్రపంచ వేదికగా పనిచేస్తుంది. ఇది మ్యూజియాలకు అంకితం చేయబడిన ఒక ప్రభుత్వేతర సంస్థ. యునెస్కోతో అధికారిక సంబంధాలను కొనసాగిస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్‌తో సంప్రదింపుల హోదాను కలిగి ఉంది.
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఐకాం ద్వారా స్థాపించబడింది. ప్రతి ఏడాది మే 18న దీనిని జరుపుకుంటారు. సమాజంలో మ్యూజియంల పాత్రను ప్రోత్సహించడానికి ఐకాం 1977లో ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. మ్యూజియంలు సమాజానికి ఎలా దోహదపడతాయనే దానిపై అవగాహన కల్పించడం, సాంస్కృతిక మార్పిడి, వైవిధ్యం, సమగ్రతను ప్రోత్సహించడం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకోవడం దీని ఉద్దేశ్యం. విద్య, ఆనందం, జ్ఞాన భాగస్వామ్యం కోసం నైతికంగా, వృత్తిపరంగా విభిన్న అనుభవాలను అందిస్తూ సమాజం భాగస్వామ్యంతో పనిచేస్తాయి.సంస్కృతి మార్పిడికి, సంస్కృతుల సుసంపన్నతకు, ప్రజల మధ్య పరస్పర అవగాహన, సహకారం, శాంతిని పెంపొందించడానికి మ్యూజియాలు ఒక ముఖ్యమైన సాధనం. ఈ అంశాలపై అవగాహన పెంచడమే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం లక్ష్యం. 2024 థీమ్ ”మ్యూజియమ్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ – విద్య, పరిశోధనల కోసం మ్యూజియంలు”. అంతర్జాతీయంగా మ్యూజియాలు ఎదుర్కొంటున్న సంబంధిత థీమ్ లేదా సమస్యను ప్రతిబింబించేలా ప్రతి ఏడాది మారుతున్న నిర్దిష్ట థీమ్‌ను ఈవెంట్ హైలైట్ చేస్తుంది. ఈ రోజున మ్యూజియం నిపుణులు ప్రజలను కలుసుకోవడానికి, మ్యూజియంలు ఎదుర్కొనే సవాళ్ల గురించి వారిని అప్రమత్తం చేయడానికి, సమాజ అభివృద్ధిలో మ్యూజియంలు పోషించే పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అంచనా వేసిన మొత్తం మ్యూజియంల సంఖ్య దాదాపు 1,04,000. కాపిటోలిన్ మ్యూజియం బహుశా ప్రపంచంలోని పురాతన మ్యూజియం. ఇది క్రీ.పూ1471 లో ఇటలీలో స్థాపించబడింది. మ్యూజియంలు శాస్త్రీయ చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైన వస్తువులను కలిగి ఉంటాయి. గతాన్ని అధ్యయనం చేయడానికి ముఖ్యమైన మూలాధారాలుగా పనిచేస్తాయి.ఇండియాలో మన గతాన్ని మనం తెలుసుకునేలా చేయడం ద్వారా మన సమాజ అభివృద్ధిలో మ్యూజియంలు గణనీయమైన పాత్ర పోషిస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. భారతదేశం ఈ కోణంలో దాదాపు 5వేల ఏండ్ల చరిత్రలో దాదాపుగా విడదీయని సాంస్కృతిక సంప్రదాయాన్ని కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయం. కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం భారతదేశంలోని పురాతన, అతిపెద్ద మ్యూజియం. ఇది 1814లో స్థాపించబడింది. ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇది శిలాజాలు, ఆభరణాలు, పురాతన వస్తువులు, కవచం, పెయింటింగ్‌ల సేకరణను కలిగి ఉంది. ఇది ఆర్ట్, ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, జియాలజీ, జువాలజీ, ఎకనామిక్ బోటనీ అనే ఆరు విభాగాలను కలిగి ఉంటుంది. ఏప్రిల్ 20, 2024 నాటికి భారతదేశంలో మొత్తం 14201 మ్యూజియంలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 32,తెలంగాణలో 36 మ్యూజియంలు ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మ్యూజియంలు, జిల్లా స్థాయి మ్యూజియంలు, విశ్వవిద్యాలయాల పరిధిలోని మ్యూజియంలు అలాగే అనేక ప్రయివేటు మ్యూజియంలు కూడా ఉన్నాయి. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని సెంట్రల్ కోల్‌కతాలో ఒక భారీ మ్యూజియం. స్వాతంత్య్రానికి ముందు ఇంపీరియల్ మ్యూజియం ఆఫ్ కలకత్తా అని పిలిచేవారు. ఇది ప్రపంచంలోని తొమ్మిదవ పురాతన మ్యూజియం. అంతేకాక సేకరణ పరిమాణం ప్రకారం భారతదేశం, ఆసియాలో పురాతన అతిపెద్ద మ్యూజియం.
సాంస్కృతిక శాఖ – మ్యూజియంలు
సంస్కృతి మంత్రిత్వ శాఖ ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి దేశంలోని మ్యూజియంల అభివృద్ధి,అప్‌గ్రేడేషన్. దేశంలోని మ్యూజియంలను బలోపేతం చేయడం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ముఖ్యమైన కార్యకలాపం. నేషనల్ మ్యూజియం-న్యూఢిల్లీ, ఇండియన్ మ్యూజియం, విక్టోరియా మెమోరియల్ హాల్-కోల్‌కతా, సాలార్ జంగ్ మ్యూజియం- హైదరాబాద్, అలహాబాద్ మ్యూజియం, ఇందిరా గాంధీ రాష్ట్రీయ మానవ్ సంగ్రహాలరు భోపాల్, మూడు నేషనల్ గ్యాలరీస్ ఆఫ్ మోడరన్ వంటివి భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన మ్యూజియంలు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులోనివి వివిధ హోదాల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేస్తాయి.ఇవే కాకుండా, పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా దేశంలోని ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలకు సమీపంలో 44 ప్రదేశాలలో సైట్ మ్యూజియంలను కలిగి ఉంది.
మ్యూజియం సేకరణల డిజిటలైజేషన్
మ్యూజియం నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం, ఈ మ్యూజియంల సేకరణలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా వాటిని అందుబాటులో ఉంచాలి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన ఆధ్వర్యంలోని మ్యూజియంల సేకరణల డిజిటలైజేషన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ వీక్షణ కొరకు ”జతన్” అనే సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసింది.మొదటి దశలో నేషనల్ మ్యూజియం, న్యూఢిల్లీ ఇండియన్ మ్యూజియం, కోల్‌కతా విక్టోరియా మెమోరియల్ హాల్ కోల్‌కతా, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ న్యూఢిల్లీ, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ముంబై, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ బెంగళూరు, మ్యూజియం అలహాబాద్, సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్, నాగార్జునకొండ మ్యూజియం, గోవా మ్యూజియంలు ఉన్నాయి. పౌరులు డిజిటల్ రిపోజిటరీ ద్వారా సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. మ్యూజియం గురించి వివరణ కళాఖండాల కాలక్రమం విజువలైజేషన్ ప్రదర్శనల వర్చువల్ గ్యాలరీ కొరకు మ్యూజియమ్స్ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్ అందుబాటులో ఉంటుంది.
– డి. జనక మోహన రావు 8247045230