– వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
నవతెలంగాణ – హైదరాబాద్: వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో జరిపిన రౌండ్ టేబుల్ సమావేశానికి సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షత వహించగా.. వివిధ వామపక్ష పార్టీలు, సంఘాల నాయకులు సమావేశంలో మాట్లాడారు. మాట్లాడిన ముఖ్య అంశాలు.. మూసీ ప్రక్షాళన జరగాలని, దానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. అంతేకానీ ప్రభుత్వం మూసీ సుందరీకరణ కోసం వేలాదిమంది పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను తొలగించాలనుకోవడం సమంజసం కాదు. టూరిజం అభివృద్ధి కోసం, కార్పొరేట్ కంపెనీల వ్యాపారాల కోసం పేదల ఇండ్లను తొలగించపూనుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి డీ పీ ఆర్ తో సహా ఎలాంటి ప్రతిపాదనలు ప్రజల ముందుంచకుండానే ఇండ్ల తొలగింపుకు పూనుకోవడం అప్రజాస్వామిక చర్య. మూసీ ప్రాజెక్టులో ప్రభుత్వం చేపట్టదలచిన అభివృద్ధిపై విస్తృత చర్చలు జరిపిన తర్వాత ప్రజల ఆమోదంతోనే ముందుకు వెళ్లాలి. బఫర్ జోన్ ను ముట్టుకోబోమని డిప్యూటీ ముఖ్యమంత్రి చెబుతుండగా.. 50 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించి భూసేకరణ చట్టం ప్రకారం ముందుకు వెళ్తామని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెబుతున్నారు. ఇలాంటి గందరగోళ ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూసీ నదితో ముడిపడి, నది పరిసరాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదలను అభివృద్ధిలో భాగస్వాములు చేయకుండా, వాళ్ల ఉపాధిని పట్టించుకోకుండా, ఏకపక్షంగా నగరం అవతలకు పంపించే చర్యలు ప్రజా పాలన అనిపించుకోదు. ముసీ నిర్వాసిత ప్రజలతో వారి నివాస హక్కుల కోసం, ప్రభుత్వ బెదిరింపు చర్యలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడుతామని ప్రకటించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ(ఎం) తరఫున నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మహేందర్, సౌత్ జిల్లా కమిటీ నాయకులు ఎం బాలు,అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నగర కార్యదర్శి ఎం వరలక్ష్మి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ తరఫున రాష్ట్ర నాయకురాలు ఝాన్సీ, సీపీఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు ఎస్ఎల్ పద్మ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు అనురాధ, ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు సంధ్య, మానవ హక్కుల వేదిక నాయకులు సయ్యద్ బిలాల్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూప, పి ఓ డబ్ల్యు నగర కార్యదర్శి భారతి, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు అనసూయ, ఐఎఫ్ టియు రాష్ట్ర నాయకురాలు అరుణ,దామగుండం పరిరక్షణ సమితి నాయకురాలు గీత వివిధ బస్తీల నుండి వచ్చిన మూసి బస్తీల ప్రతినిధులు మాట్లాడారు.