సంగీత రసధునులు ఆ చేతులు!

The hands of music lovers!ప్రపంచానికి భారతీయ శాస్త్రీయ తబలా సంగీతాన్ని పరిచయం చేసిన ఘనుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుసేన్‌. ఆయన ప్రఖ్యాత హిందూస్థానీ తబలా విద్వాంసకుడే కాదు, సంగీత నిర్మాత, కంపోజర్‌, సినీ నటుడు, పర్‌క్యూషనిస్ట్‌. తన 73వ యేటా తీవ్ర అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూసారనే వార్త ప్రపంచ సంగీత విద్వాంసులు, సంగీతాభిమా నులను, ముఖ్యంగా భారతీయులను నివ్వెరపరిచింది. 09 మార్చి 1951న ముంబాయిలో జన్మించిన జాకీర్‌ హుసేన్‌ తండ్రి ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ”ఉస్తాద్‌ అల్లా” రాఖా కావడంతో తన ఏడవ ఏటి నుంచే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తబలాపై అసమాన్య పట్టు సాధిస్తూ, పన్నెండవయేటనే ప్రదర్శనలిస్తూ సంగీతకారుల మన్ననలు పొందడం, ప్రపంచానికి తన తబలా సంగీతాన్ని పరిచయం చేయడం జరిగింది. ముంబాయిలోని సెయింట్‌ మైఖేల్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌, సెయింట్‌ గ్జేవియర్స్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. వెల్లింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి సంగీతంలో డాక్టరేట్‌ పట్టా పొందారు. ప్రముఖ కథక్‌ నర్తకి, తన మేనేజర్‌, గురువైన ‘ఆంటోనియా మిన్నెకోలా’ను వివాహమాడారు. వారికి ఇద్దరు కూతుళ్లు. 1970లో అమెరికా పర్యటించి ఏడాదికి 150కి పైగా సంగీత ప్రదర్శనలిస్తూ, వివిధ రకాల సంగీత విద్వాంసులతో కలిసి అబ్బురపరిచే తబలా సంగీత విన్యాసాలను, అనేక రకాల స్టైల్స్‌ను, జాజ్‌, వరల్డ్‌ మ్యూజిక్‌లను మేళవించి సంగీతాభిమానుల మనసులు దోచుకున్నారు. 1991లో డ్రమ్మర్‌ మైఖేల్‌ హార్ట్‌తో కలిసి ప్లానెట్‌ డ్రమ్‌ ఆల్బమ్‌ తీసి ”గ్రామీ అవార్డు”తో పాటు అనేక ఇతర అవార్డులు పొందారు. 1996 అట్లాంటా ఓలంపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో తన తబలా సంగీత కళలో చూపరుల మన్ననలు పొందారు. ఆరు దశాబ్దాలకు పైగా తబలా సంగీతానికి పట్టాభిషేకం చేసిన జాకీర్‌ హుసేన్‌ మన భరతమాత ముద్దుబిడ్డ కావడం మనకు గర్వకారణం.
ఉస్తాద్‌ జాకీర్‌ హుసేన్‌ సంగీత కృషి, ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1988లో ‘పద్మశ్రీ’, 2002లో ‘పద్మ భూషణ్‌’, 2023లో ‘పద్మ విభూషణ్‌’ పురస్కారాలతో సత్కరించింది.1999లో ‘యూఎస్‌ నేషనల్‌ హెరిటేజ్‌ ఫెల్లోషిప్‌’ పొందారు. 2024లో నిర్వహించిన 66వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఐదు కేటగిరీల్లో ప్రపంచ ప్రఖ్యాత ‘గ్రామీ మ్యూజిక్‌ అవార్డులు’ స్వీకరించిన తొలి భారతీయ సంగీత విద్వాంసుడిగా పేరు పొందారు. పలు ప్రపంచ ప్రఖ్యాత సమకా లీన సంగీత విద్యాంసులతో కలిసి సంగీత సృజనకు ఊపిరి పోశారు. 2006లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ”కాళిదాసు సమ్మాన్‌”, 1990లో ‘భారత సంగీత నాటక అకాడమీ అవార్డు’, 2018లో ‘రత్న సదస్య’ పురస్కా రం, 2019లో ‘సంగీత నాటక అకాడమీ ఫెల్లో’గా గుర్తింపు పొందారు. అనేక సినిమాలకు తన సంగీత సహకారం అందిస్తూనే, 2015లో ‘సింఫొనీ ఆర్కెస్ట్రా ఆఫ్‌ ఇండియా’తో మరిచిపోలేని సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పలు అమెరికన్‌ యూనివర్సిటీల్లో సంగీత పాఠ్యాంశాలు బోధిస్తూ, రేపటి తరానికి సంగీత సామర్థ్యాలను అవగాహన పరిచారు. 2017లో ఎస్‌ఎఫ్‌జజ్‌ వేదికలో ‘జీవన సాఫల్య పురస్కారం’, 2022లో ప్రఖ్యాత ‘క్యోటో ప్రైజ్‌’ను స్వీకరించారు. 2016లో నాటి అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా పిలుపుతో వైట్‌ హౌజ్‌లో తన ప్రతిభను ప్రదర్శించారు. అసంఖ్యాక మ్యూజిక్‌ అల్బమ్స్‌ సృష్టికర్తగా పేరు తెచ్చుకున్న జాకీర్‌ హుసేన్‌ జీవిత విశేషాలను పొందుపరుస్తూ ”జకీర్‌ హుసేన్‌ : ఏ లైఫ్‌ఇన్‌ మ్యూజిక్‌” అనే పుస్తకాన్ని నసీర్‌ మున్నీ కబీర్‌ అనబడే రచయిత రచిం చారు. ముంబాయి యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందిన జాకీర్‌ హుసేన్‌ సంగీత జీవితం నేటి సంగీతాభిమానులు, యువ సంగీత కళాకారులకు దారిదీపం కావాలని కోరుకుందాం. ఉస్తాద్‌ తబలా వాయిద్య కళను సాధన చేసి శ్రోతలకు వీనుల విందుచేద్దాం.
– డా: బి.మధుసూదన్‌ రెడ్డి, 9949700037