ముస్లిం నాయకులే టార్గెట్‌

ముస్లిం నాయకులే టార్గెట్‌– ఆరుగురు కీలక నేతలపై 175 కేసులు నమోదు
– వీరిలో కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ లీడర్లు
– యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదీ పరిస్థితి
న్యూఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలకు రక్షణ కరువైంది. అంతేకాదు, మైనారిటీ వర్గం నుంచి వచ్చే నాయకులకూ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నాయి బీజేపీ ప్రభుత్వాలు. ఇందుకు యూపీలోని యోగి సర్కారే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ యోగి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీ వర్గానికి చెందిన కీలక నాయకులను టార్గెట్‌ చేసుకున్నది. ఇందులో భాగంగా ఆరుగురు కీలక నాయకులపై 175 కేసులు నమోదు చేసింది. దీంతో సదరు నాయకులు అన్యాయంగా జైళ్లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని సామాజికవేత్తలు చెప్తున్నారు. తమ వర్గం ప్రజలకు అండగా ఉండి ధైర్యం నింపే ఇలాంటి నాయకులపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేయించటం ద్వారా వారిని మానసికంగా దెబ్బతీసి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించటమే యోగి సర్కారు లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఐదేండ్ల క్రితం బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)కి చెందిన హాజీ యాకూబ్‌ ఖురేషీ మీరట్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. మే 25న, 28వ రౌండ్‌ ఓట్ల లెక్కింపులో మీరట్‌ మాజీ మేయర్‌, బీజేపీ అభ్యర్థి రాజేంద్ర అగర్వాల్‌ కంటే ముందంజలో ఉన్నారు. విజయం ఇక లాంఛనమేననుకొని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచడం ప్రారంభించారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు హల్‌చల్‌ చేయడం ప్రారంభించాయి. కానీ కొన్ని గంటల తర్వాత, ఖురేషీకి ఐదు లక్షలకు పైగా ఓట్లు వచ్చినప్పటికీ, అతను అగర్వాల్‌ చేతిలో 4,729 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.బీజేపీ మద్దతుదారులలో కూడా.. ఎన్నికల ”రిగ్గింగ్‌” జరిగిందని గుసగుసలు వినబడ్డాయి. మీరట్‌లోని ఒక సీనియర్‌ బీజేపీ నాయకుడు మాట్లాడుతూ.. ”సుమారు ఐదు ఈవీఎంల ఓట్లను లెక్కించకపోవటంతో ఖురేషీ ఓడిపోయాడు. వాటిలో ఒక్కొక్కటి 1500 ఓట్లు ఉన్నాయి” అని చెప్పారు. ఆ ఎన్నికలో 370కి పైగా నియోజకవర్గాలలో పోలైన, లెక్కించబడిన ఓట్లలో అసమతుల్యత ఉన్నట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఐదేండ్ల తర్వాత ఖురేషిపై ఏడు కేసులు నమోదయ్యాయి. మొత్తం ఎనిమిది నెలల జైలు జీవితం గడిపాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. అయితే 2019 నుంచి, ఖురేషీతో సహా కనీసం ఆరుగురు ప్రభావవంతమైన ముస్లిం నాయకులపై పశ్చిమ యూపీలో యూపీ గ్యాంగ్‌స్టర్స్‌ అండ్‌ యాంటీ సోషల్‌ యాక్టివిటీస్‌ (నివారణ) చట్టం కింద కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందినవారున్నారు. వీరిలో గతంలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన తబస్సుమ్‌ హసన్‌, ఆమె కుమారుడు, మూడుసార్లు కైరానా ఎమ్మెల్యేగా ఎన్నికైన నహిద్‌ హసన్‌, ఎస్పీ వ్యవస్థాపక సభ్యుడు ఆజం ఖాన్‌, ఆయన భార్య, మాజీ రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యే తజీన్‌ ఫాత్మాలు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి బిజ్నోర్‌ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు షెర్బాజ్‌ పఠాన్‌ పైనా కేసు నమోదైంది. వారిపై గ్యాంగ్‌స్టర్స్‌ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తబస్సుమ్‌, నహిద్‌ మినహా మిగతావారి కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేస్తున్నప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పశ్చిమ యూపీలో తన ర్యాలీలలో ప్రభావవంతమైన ముస్లిం నాయకులపై తన ప్రభుత్వ చర్యను సమర్థించుకోవటం గమనార్హం.