సీఏఏలో ముస్లిం మైనారిటీలు మినహాయింపు

Muslim minorities are exempted from CAA– కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ ఆందోళన
న్యూయార్క్‌ : పౌరసత్వ (సవరణ ) చట్టం (సీఏఏ) స్పష్టంగా ముస్లిం మైనారిటీలను మినహాయించిందని యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రెలీజియస్‌ ఫ్రీడమ్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) పేర్కొంది. సీఏఏ అమలు కోసం కేంద్రం విడుదల చేసిన నిబంధనల నోటిఫికేషన్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. మతం, విశ్వాసాల ఆధారంగా ఏ ఒక్కరి పౌరసత్వాన్ని తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ విదేశాలలో మతపరమైన స్వేచ్ఛను పర్యవేక్షించడానికి, విశ్లేషించడానికి, నివేదించడానికి అమెరికా కాంగ్రెస్‌ సభ్యులచే స్థాపించబడిన స్వతంత్ర, ద్వైపాక్షిక సమాఖ్య సంస్థ.
వివాదాస్పద సీఏఏ పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులకు భారత్‌ మతపరంగా ఆశ్రయం కల్పిస్తోందని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ సెచ్నక్‌ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. హిందువులు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లకు సీఏఏ ఆశ్రయం కల్పించినపుడు, ఈ చట్టం ప్రత్యేకంగా ముస్లింలకు మాత్రమే ఎందుకు మినహాయింపునిచ్చిందని ప్రశ్నించారు. ఈ చట్టం వాస్తవంగా పొరుగుదేశాల్లో హింసకు గురైన మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు రూపొందించినట్లైతే.. బర్మా నుండి వచ్చిన రోహింగ్యా ముస్లింలకు, పాకిస్తాన్‌ నుంచి వచ్చిన అహ్మదీయ ముస్లింలు, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి వచ్చిన హజారా షాహిలు సహా ఇతరులకు కూడా చట్టంలో స్థానం కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై టామ్‌ లాంటోస్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ గతవారం చేపట్టిన విచారణలో సెచ్నక్‌ వివరణనిచ్చారు. భారత్‌లోని మత స్వేచ్ఛ అంశాలను బహిరంగంగా చర్చించాలని యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులను యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ కోరింది.
ప్రభుత్వ ప్రతినిధులతో, ముఖ్యంగా కాంగ్రెస్‌ సభ్యులతో చర్చలలో మత స్వేచ్ఛ అంశాన్ని కూడా చేర్చాలని పిలుపునిచ్చింది. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఇటీవల స్పష్టం చేసినట్టు .. మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు చట్ట ప్రకారం సమానంగా రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలు అమలయ్యేలా చూడాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ కమిషనర్‌ డేవిడ్‌ కర్రీ పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు మద్దతుగా నిలిచిన మానవహక్కుల కార్యకర్తలను నిర్బంధం నుంచి విడుదల చేసేందుకు భారత అధికారులతో కలిసి పనిచేయాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ అమెరికా ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన తెలిపారు.