స్వాతంత్ర్యో‌ద్య‌మంలో తెలంగాణ ముస్లిం మ‌హిళా యోధులు

Muslim women fighters of Telangana in freedom movementస్వరాజ్యం కోసం సాగిన సుదీర్ఘపోరాటంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలెందరో. పాలక పక్షాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన వారికి ప్రతిఫలంగా పలురకాల శిక్షలు లభించాయి. భారత జాతీయోద్యమానికి సహాయ, సహకారాలు అందించి ప్రపంచానికి తెలియకుండా ఉండిపోయిన ఆడపడుచులు ఎందరో. ఆ తల్లుల త్యాగాలు ఎంత శ్లాఘనీయమైనవైనా అధికారిక చిట్టాలకెక్కి అక్షరరూపం ధరించక పోవడంతో వారి వివరాలు తర్వాతి తరానికి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రత్యక్ష పోరులో శిక్షలకు గురైన వారి వివరాలు మాత్రం ఆనాటి ప్రభుత్వ, పోలీసుల రికార్డులలో నిక్షిప్తమై ఉన్నందున కొంతలో కొంత ఆ యోధురాండ్ర సమాచారం లభ్యం అవుతుంది. ఈ విధంగా ప్రభుత్వ, పోలీసు రికార్డుల ఆధారంగా తయారైన గ్రంథాలలో స్థానం పొందిన తెంగాణ రాష్ట్రానికి చెందిన ముస్లిం మహిళా యోధులు కొందరు. ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారి పరిచయం క్లుప్తంగా నేటి మానవిలో…

తొలి మహిళా మంత్రిగా…
మసుమా బేగం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి మహిళా మంత్రి, తొలి ముస్లిం మంత్రి, మొత్తం భారత దేశంలోనే మంత్రి పదవిని చేపట్టిన తొలి ముస్లిం మహిళ అయిన ఈమె 1902 అక్టోబర్‌ 7న హైదరాబాద్‌లో జన్మించారు. తల్లి తయ్యిబా బేగం, తండ్రి ఖదీప్‌ జంగ్‌. విద్యావంతురాలు, సంఘసేవకురాలైన తల్లి ద్వారా ఈమె ప్రభావితమయ్యారు. తయ్యిబా పత్రికల్లో వ్యాసాలు, నాలుగు నవలలు కూడా రాశారు. తండ్రి వైద్యశాఖలో ఉప డైరెక్టర్‌గా చేశారు. ఈమె కుటుంబం మొత్తం రాజకీయ నేపథ్యం కలిగిందే. మాసుమా 9 ఏండ్ల వయసులో లేడి హైదరి క్లబ్‌లో సభ్యురాలిగా చేరి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు విద్యావ్యాప్తికి నడుం కట్టారు. 1921లో విద్యావ్యాప్తి కోసం అంజుమన్‌- యే- ఖవాతీన్‌ సంస్థకు అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 1927లో అఖిల భారత మహిళా సంస్థ హైరదాబాద్‌ నగర శాఖ ఏర్పాటు చేసి పలు బాధ్యతలను నిర్వహించారు. లండన్‌ ఉమెన్స్‌ కాన్ఫెరెన్స్‌ అహ్వానం మీద లండన్‌ వెళ్లారు. జాతీయోద్యమంలో భాగంగా ఉనికిలోకి వచ్చిన పలు సంఘాలలో ఆమె సభ్యురాలయ్యారు. 1952లో షాలిబండ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంచి వక్త, కార్యదక్షురాలుగా ఖ్యాతిగాంచిన మాసుమా బేగం అఖిల భారత మహిళా సంస్థ నేతగా అనేక దేశాలు కూడా పర్యటించారు.

తెలంగాణ ప్రజాపోరుకు తోడ్పడిన మోధురాలు
రజియా బేగం… 1916లో హైదరాబాద్‌ సంస్థానంలో జన్మించారు. ఆమె తల్లిది హైదరాబాద్‌ కాగా, తండ్రి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు. నైజాం సంస్థానంలో ఈయన న్యాయాధికారి. తల్లిదండ్రులిచ్చిన స్వేచ్ఛతో రజియా తన అన్నదమ్ములతో పాటు చిన్ననాటనే స్వతంత్రభావనలు అలవర్చుకున్నారు. నిగార్‌ ఉర్దూ పత్రికను రహస్యంగా చదువుతూ చైతన్యం పొందారు. తమీర్‌ అనే గోడ పత్రికను ప్రారంభించారు. చిన్న చిన్న కథలు కూడా రాసేవారు. స్వయం కృషితో విద్యనభ్యసించిన రజియా తనకు నచ్చని ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించే వారు. బజ్మె ఏహ్‌ బాబ్‌ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అన్నదమ్ములతో కలిసి జాతియోధ్యమంలో భాగమయ్యారు. తర్వాత కమ్యూనిస్టు పార్టీవైపుకు మొగ్గుచూపి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నిషేధంలోనూ పార్టీకి అండగా నిలబడ్డారు. అనేక కష్టాలు అనుభవించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనం కోరుతూ జరిగిన పోరాటంలో తన వంతు పాత్ర పోషించారు. పోరాటం విరమించిన తర్వాత ఉమెన్స్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. 1966లో యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో చేరారు. పర్షియన్‌ పీహెచ్‌డీ ఇరాన్‌లో చేశారు.

విలీనోద్యమంలో జైలుకెళ్లీ…
నఫీస్‌ ఆయేషా బేగం… హైదరాబాద్‌కు చెందిన స్వాతంత్య్ర సమర వీరుడు జనాబ్‌ హమీద్‌ ఆలీఖాన్‌ కుమార్తె. తండ్రి ప్రభావంతో ఆమె హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక ఇండియన్‌ యూనియన్లో చేరడానికి నిరాకరించిన నైజాం సంస్థానాధీశుల పట్ల నఫీస్‌ నిరసన వ్యక్తంచేశారు. నైజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని, నైజాం నివాసులంతా భారతదేశ పౌరులుగా పరిగణించబడాలని ఆమె ఆకాంక్షించారు. దీని కోసం జరిగిన ఉద్యమంలో భాగం పంచుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన ఆ ఉద్యమం జాతీయోద్యమ చరిత్రలో విలీనోద్యమంగా పరిగణించబడింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న నఫీస్‌ను 1948, సెప్టెంబర్‌16న అరెస్టు చేసి హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలులో నిర్బంధించాయి. చివరకు నైజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది. ఆ స్వాతంత్య్ర సమరయోధురాలు, విలీనోద్యమకారిణి పూర్తి వివరాలు తెలియలేదు. ప్రముఖ చరిత్ర పరిశోధకురాలు డాక్టర్‌ సరోజిని రేగాని సంపాదకత్వంలో WHO’S WHO OF FREEDOM STRUGGLE IN ANDHRA PRADESH శీర్షికతో 1978లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రచురించిన ప్రథమ సంపుటంలో ఆమె స్థానం పొందింది. ఈ విధంగా ఆ సంపుటంలో స్థానం పొందగలిగిన ఏకైక ముస్లిం మహిళ నఫీస్‌ అయేషా బేగం కావడం విశేషం.

ప్రజా పోరాటాలకు బాసటగా నిలిచిన యోధురాలు
జమాలున్నీసా బాజి… ఇండియన్‌ యూనియన్‌లో నైజాం రాష్ట్రం విలీనం కోరుతూ సాగిన ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఆ క్రమంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ప్రజల పక్షం వహించిన ముస్లిం మహిళా ఉద్యమకారులలో ఈమె ఒకరు. జమాలున్నీసా 1915లో హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి నైజాం సంస్థానంలో న్యాయాధికారి. కుటుంబంలోని పెద్దలు ఆచార సంప్రదాయాలు పాటించినా తల్లిదండ్రులు ఉదార స్వభావులు. తండ్రి నుంచి లభించిన స్వేచ్ఛతో భారత స్వాతంత్య్రోద్యమంలో భాగమయ్యారు. మతపరమైన ఛాందసాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. పెండ్లి తర్వాత ఆమె కొన్ని రోజులు ఇంటికే పరిమితం కావల్సి వచ్చింది. అప్పుడు కూడా పుస్తకాలు చదివేవారు. తర్వాత తిరిగి ఉద్యమంలో పాల్గొన్నారు. సాహిత్య సమావేశాలకు కూడా హాజరయ్యేవారు. కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులయ్యారు. 1946లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అన్ని రంగాల్లో సమానత్వం సమసమాజం ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మిన ఆమె ఎంతో నిబద్ధతతో మున్ముందుకు సాగారు. నిర్భంధంలోనూ పార్టీ కోసం పని చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన తర్వాత మహిళా సంఘం ఏర్పాటుకు కృషి చేశారు.

నిజాం గడ్డ మీద విదేశీవస్త్రాలను తగులబెట్టిని సాహసి
ఫక్రుల్‌ హాజియా హసన్‌… భారత స్వాతంత్య్ర సంగ్రామంలో స్వయంగా పాల్గొనడమే కాకుండా తన బిడ్డలను విముక్తిపోరాటం దిశగా ముందుకు సాగడానికి ప్రేరణగా నిలచిన తల్లులు అరుదుగా కన్పిస్తారు. జాతీయోద్యమంలో స్వయంగా పాల్గొనడంతో పాటు ‘హైద్రాబాద్‌ హసన్‌ సోదరులు’గా విఖ్యాతిగాంచిన ముగ్గురు కుమారులను స్వాతంత్య్ర సమరయోధులుగా తీర్చిదిద్దిన ఈ తల్లి చరితార్థులయ్యారు. ఇరాన్‌ నుండి ఇండియా వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందిన హాజియా 1870లో జన్మించారు. ఉత్తరప్రదేశ్‌ నుండి హైదరాబాద్‌ వచ్చిన అమీర్‌ హసన్ను వివాహం చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. భర్త అమీర్‌ హసన్‌ హైదరాబాద్‌ సంస్థానంలో ఉన్నతాధికారి, ఆయన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలను పర్యటిస్తున్నందున ఆమె కూడా ఆయా ప్రాంతాలలోని ప్రజల భాషల పట్ల అమితా సక్తి చూపుతూ ఉర్దూతోపాటు ఆంగ్లం, మరాఠీ, కన్నడ, గుజరాతీ, భాషలే కాకుండా తెలుగును కూడా నేర్చు కున్నారు. ఈ సందర్భంగా మహిళల దుస్థితిని గమనించిన ఆమె ముఖ్యంగా బాలికల అభ్యున్నతికి కృషి ఆరంభించారు. బాలికల లో విద్యాభివృద్ధికై పలు పాఠశాలలు పెట్టించడానికి కృషి సల్పారు. జాతీయోద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1920లో మహాత్ముని పిలుపు మేరకు హైదరాబాద్‌ నగరంలోని త్రూప్‌ బజార్లోని తమ నివాసంలో విదేశీ వస్త్రదహనం గావించారు. ఖిలాఫత్‌ -సహాయనిరాకరణ ఉద్యమాల లోనూ చురుకైన పాత్ర వహించారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధులు అరెస్టులకు గురైనప్పుడు వారి విడుదల కోసం సరోజినీ నాయుడి సహకారంతో ఎనలేని కృషి సల్పారు. నాయకులు అందరూ ఆమెను ఆప్యాయంగా ‘అమ్మా జాన్‌’ అని సంబోధించే వారు. ఈమె 1970లో కన్నుమూశారు.