
నవతెలంగాణ – రాయపోల్
వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని తొగుట సిఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ విక్కుర్తి రఘుపతి అన్నారు.గురువారం రాయపోల్ మండల కేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ముగింపు సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జాతీయ భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్లు ఆర్టీవో జారీచేసిన చట్ట ప్రకారమే వాహనాల్లో పరిమితికిమించి ప్రయాణికులను ఎక్కించవద్దని, డ్రైవర్ ముందు సీటులో కుడి ఎడమ పక్కన ఎవరిని కూర్చోపెట్టరాదని తెలిపినారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, అర్.సి. ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రలు కలిగివుండాలని, వాహనానికి సంబందించిన సర్టిఫికెట్లు లేకుండా ఎవరైనా వాహనం నడిపితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటోలను రోడ్డుపై నిలపడం వల్ల ఇతర వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. 18 సంవత్సరాలలోపు పిల్లలు వాహనాలు నడప రాదని, అలా నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, ఆటోలో పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టుకొని ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎవరైనా సెల్ ఫోనులో మాట్లాడుతూ వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రాంగ్ రూట్ లో ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న వారికి జరిమానా విధిస్తామని,ఆటో ముందు సీట్లో డ్రైవర్ పక్కన ఎవరినైనా కూర్చున్నపెట్టుకున్నచో ఈ-చాలన్ ద్వారా జరిమానా విధిస్తామని తెలిపినారు. విద్యార్థులు ఉన్నతంగా ఉన్నత ఆశయాలతో చదువుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలపై మీ తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ రఘుపతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కిష్టారెడ్డి, ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు నవీన్ గౌడ్, కనకయ్య,పోలీస్ సిబ్బంది, గ్రామ యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.