మార్చి 2025 లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు కోరారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి అధ్యక్షతన మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్ళు మరియు కేజీబీవీ ప్రత్యేక అధికారులకు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఐఏఎస్ పాల్గొని మార్చి 2025 లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని కోరినారు. దీని కొరకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతిరోజు ఒక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శిస్తానని తెలిపినారు. జిల్లా విద్యాశాఖాధికారి కే సత్యనారాయణ గారు మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీ నిర్వహించబడే నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలని కోరారు. పాఠశాలల్లో నిర్వహించబడే వివిధ కార్యక్రమాల గురించి ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట రాజయ్య విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో ఒత్తిడిని నివారించడం కొరకు వ్యక్తిత్వ వికాసం మరియు ప్రాణాయామంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఎన్ ప్రశాంత్ రెడ్డి డిసిఈబి సెక్రెటరీ శ్రీ పాండు నాయక్, సహాయ పరీక్షల కమిషనర్ కే రఘురాంరెడ్డి సమగ్ర శిక్షా కోఆర్డినేటర్లు శ్రీనివాసులు, పి లింగారెడ్డి, శ్రీహరి అయ్యంగార్, రాధ, నరహరి, మండల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.