
– నిర్వహణ గాలికి వదిలేసిన అధికారులు
– ఉపయోగంలోకి తీసుకరావాలని పశుపోషకుల వేడుకోలు
నవతెలంగాణ – మల్హర్ రావు
వేసవిలో మూగజీవాలు నీటి కోసం తండ్లాడుతున్నాయి.ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకంలో జీవాల దాహార్తి తీర్చడానికి గిరిజన తండాలు,గ్రామాల్లో నీటి తొట్టిలు నిర్మించింది.సంబంధించిన అధికారులు వీటి నిర్వహణ గాలికొదిలేయడంతో మూగజీవాలు తాగునీటి కోసం తండ్లాడుతున్నాయి.కొన్ని చోట్ల నీటి తొట్లు శితిలావస్థకు చేరగా, మరికొన్ని నిర్మాణాలు నాసిరకంగా చేయడంతో దెబ్బతిన్నాయి.దీంతో పశు పోషకులు జీవాల దాహార్తి తీర్చడానికి అవస్థలు పడుతున్నారు. మండలంలో మొత్తం 15 గ్రామపంచాయితీల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లోకి వచ్చినస్పటి నుంచి 2019 వరకు పల్లెల్లో మూగజీవాల సంఖ్యకు అనుగుణంగా సుమారుగా 16 వరకు నీటి తొట్లు నిర్మించారు.మండలంలో తాడిచెర్ల, మల్లారం,ఇప్పలపల్లి, వళ్లెంకుంట,నాచారం,రుద్రారం తదితర గ్రామాల్లో నీటి తొట్టిలు నిరుపయోగంగా చెత్త,చెదారం,పిచ్చి మొక్కలతో శితిలావస్థకు చేరాయి.రోజురోజుకూ ఎండ తీవ్రత పెరగడంతో పశువుల దాహార్తిని తీర్చడానికి పశు పోషకులు పశువులను బోర్ బావులు, చెరువుల్లోకి తీసుకెళ్లి నీటిని తాగిస్తున్నారు. మండల వ్యాప్తంగా పశువులు సుమారుగా 18,670 ఉన్నాయి. అడవికి మేతకు వెళ్లి తాగునీటి కోసం అల్లాడుతున్నాయి.అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పశుపోషకులు వాపోతున్నారు.ఎండలు దంచి కొట్టడంతో తాడిచెర్ల, మల్లారం,వళ్లెంకుంట,కుంభంపల్లి, రావుపల్లి,పివినగర్,ఇప్పలపల్లి, కేశారంపల్లి తదితర గ్రామాలకు వరప్రదాయిన మానేరు సైతం చుక్క నిరులేక ఎడారిగా మారింది.చెరువులు,కుంటలు,వాగులు,వంకలు పూర్తిగా ఎండిపోయాయి తాగునీటి కోసం పశువులు ఊళ్ళోకి వచ్చి అల్లాడుతున్నాయి.కొంతమంది రైతులు పశువుల దాహార్తి తీర్చడానికి బోర్ వబావుల వద్ద నీటిని నిల్వగా ఉంచి పశువుల దాహార్తి తీర్చుతున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయితీ అధికారులు స్పందించి నీటి తొట్టిలకు మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకరావాలని పశుపోషకులు కోరుతున్నారు.
ఎండిన వాగులు,వంకలు..మల్లయ్య రైతు
గ్రామాల్లో వాగులు,వంకలు,కుంటలు పూర్తిగా ఎండిపోయాయి.పశువులు తాగేoదుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి.నీరు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి దాహం తీర్చుకుంటున్నాయి.గ్రామాల్లో ఉన్న నీటి తొట్టిలు మరమ్మతులు చేయాలి.
చెరువుల్లో నీటిని తాగిస్తున్నాం..సమ్మయ్య పశువుల కాపరి
గ్రామాల్లో నిర్మించిన పశువుల నీటి తొట్టిలు నిరుపయోగంగా మారాయి.దీంతో పశువులను దూరంగా ఉన్న చెరువులు,వ్యవసాయ బోర్ బావుల వద్దకు తీసుకెళ్లి తాగిస్తున్నాం.ఎండలు తీవ్రమైతే నీటి మరింతగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టిలు ఉపయోగంలోకి తీసుకురావాలి.
అధికారుల దృష్టికి తీసుకెళ్తా..ఎంపిడిఓ
నీటి తొట్టిలు నిరుపయోగంగా ఉన్నమాట వాస్తవమే.సౌకర్యం లేక శిథిలావస్థకు చేరాయి.వాటికి మరమ్మతులు ఉపయోగించేలా ఉన్నతాధికారుల దృష్టికీ తీసుకెళ్తా.