ఇసుక లారీలను అడ్డుకున్న ముత్తారం రైతులు

– పంటలు ధ్వంసమవుతున్నాయని ఆందోళన
నవతెలంగాణ –  ముత్తారం
ముత్తారం మండలంలోని మానేరు నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలను ముత్తారం రైతులు మండల కేంద్రం వద్ద శుక్రవారం అడ్డుకున్నారు. ఇసుక లారీల రాకపోకల వల్ల తమ పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయని ఆందోళనకు దిగారు. వందలాది ఇసుక లారీలు ఉదయం సాయంత్రం వరకు రాకపోకలు కొనసాగించడంతో రోడ్డుపై ఉన్న దుమ్ము, దూళి లేచి పంట పొలాలపై పడి దిగుబడి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీల ద్వారా ఇసుకను తరలించే సమయంలో కనీసం రోడ్లపై వాటర్‌ స్ప్రే కూడా చేయించడం లేదని మండిపడ్డారు. రైతులు ఇసుక లారీలను అడ్డుకున్న విషయం తెలుసుకున్న ముత్తారం ఎస్‌ఐ మధుసూదన్‌ రావు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చ జెప్పారు. రోడ్లపై వాటర్‌తో స్ప్రే చేయించాలని ఎస్‌ఐ మధుసూదన్‌ రావు ఇసుక క్వారీల గుత్తేదారులకు సూచించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు