– ఎమ్మెల్సీ పల్లా దిష్టిబొమ్మ దహనానికి యత్నం
– భారీగా పోలీసుల మోహరింపు
నవతెలంగాణ-జనగామ
జనగామ నియోజకవర్గ బీఆర్‌ఎస్ టిక్కెట్ రాజకీయం హీటెక్కింది. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి – పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య రగడ మరింత పెరిగింది. రెండ్రోజుల కిందట పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు హైదరాబాదులో ఒక హౌటల్లో సమావేశం అయిన విషయం తెలిసిందే. పల్లాకే టికెట్టు ఇవ్వాలని బీఆర్‌ఎస్ అధిష్టానానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు తమ నాయకునికే టిక్కెట్ ఇవ్వాలని శనివారం జనగామ జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. ప్రధాన రోడ్లగుండా ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. పల్లా వద్దు.. ముత్తిరెడ్డి ముద్దు అంటూ నినాదించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. చౌరస్తాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని పోలీసులు అడ్డుకోగా.. వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి నేటి వరకు జనగామ ప్రాంత ప్రజల వెంట ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారన్నారు. వారికి ఇవ్వకుండా ఇతరులకు టిక్కెట్ ఇవ్వొద్దన్నారు. గతం కంటే ఇప్పుడు 50 వేల ఓట్ల మెజార్టీతో తమ నాయకున్ని గెలిపించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. పల్లాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడారు. ఈ ఆందోళనలో ముఖ్యమైన నేతలు లేకపోవడం గమనార్హం.