
– భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థన
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ : దుబ్బాకకు మచ్చలేని, అవినీతి లేని పాలన అందించిన స్వర్గీయ మంత్రి చెఱకు ముత్యంరెడ్డి పాలన చేశారు. అలాంటి పాలనను తాను గెలిచాక మళ్ళీ దుబ్బాక కు తిరిగి తీసుకొస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండల పరిధిలోని రాజక్కపేట , ఎల్లాపూర్, వడ్డెర కాలాని, బల్వంతాపూర్, పద్మశాలి గడ్డ, నర్లెన్ గడ్డ, అప్పనపల్లి, ఆకారం గ్రామాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయిపల్లి వార్డ్, చెల్లాపూర్, దుంపల పల్లి, చేర్వపూర్, ధర్మాజీపేట వార్డ్ ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబర్ 30 న దుబ్బాక నియోజకవర్గ ప్రజలు చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవన్నారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గత ఉప ఎన్నికల్లో తన పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి గెలిచారని అన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గతంలో ఇచ్చిన లవాని భూములకు పట్టాలు అందిస్తామన్నారు.రైతుభరోసా ఉచిత విద్యుత్, రూ .2 లక్షల రైతు రుణమాఫీ, పట్టాదారులకు రూ. 15 వేలు కౌలు రైతులకు రూ. 12 వేలు, గృహజ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2500ల చేయూతతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా ఏటా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామన్నారు. పేద ప్రజలకు న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మెజారిటీతో గెలిపిస్తే అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడి పనులు చేపిస్తానని ప్రజలు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కొంగరి రవి, ఉపాధ్యక్షుడు కడ్దూరి నరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నర్మేట ఏసు రెడ్డి, యువజన నాయకులు ఆకుల భారత్, మంద శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు ఉన్నారు.