తెల్లోళ్ళ దౌష్ట్యాలకు నలిగిపోయి
మేం వేదనలతో కుమిలిపోతేనేం
నీ శిరస్సున కుంకుమ కాంతులు పూశాం
యమలోకపు యాతనలు పడి
మేం వీరస్వర్గంలోకి నెట్టబడితేనేం
నీ నుదుట శాంతి రాత రాశాం
మా శోకాలతో చెక్కిన అశోక చక్రాన్ని
మేం తరతరాలు పీనుగుల్లా బతికితేనేం
నీ నుదుట ధవళ కాంతుల్లో పొదిగాం
రవి అస్తమించని దోపిడి పాలయి
మేం డొక్కలెండి చచ్చిపోతేనేం
పసిడి పంటల పచ్చందనాలు పరిచాం
దండనాధికారాల దమనకాండలో
మేం తోలుతిత్తిల్లా వేళ్ళాడిపోతేనేం
ఊపిర్లు పోగేసి నిన్ను నింగిలో నిలబెట్టాం
నీ రెపరెపలు చెవుల బడేటట్టుగా
నదీ తరంగాల్లా సగర్వంగా ఎగరవమ్మా..!
హింసో అహింసో… నాయకులు
చెరో రెక్కా లాగేస్తున్నా సంశయం లేదు
లాఠీ దెబ్బలు జైళ్ళు ఉరితాళ్ళు…
తిన్నాం ఉన్నాం వేళ్ళాడేం…
ఆచూకీ అందని అండమానో
మర్మం తెలీని బర్మాయో
చచ్చామో బతికామో
జీవచ్ఛవాలయ్యామో తెలీదు!
ఈ పసిడి నేల కోసం స్వేచ్ఛాగాలుల కోసం
రేపటి బోసి నవ్వుల కోసం..!
అనాథ శవాల్లా విసిరివేయబడ్డాం!
సర్వస్వతంత్రులైన మీరంతా
అడ్డుగోడలు అధిగమించి అడుగేయడమే
మా ఆత్మబలిదానాలకు నిండైన నివాళి!!
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253