మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే నా లక్ష్యం

My aim is to empower women economicallyమహారాష్ట్రలోని గ్రామాలకు, మహిళలకు పరిచయం అక్కరలేని ఓ పేరు సునంద తారు పవార్‌. ఇరవై ఏండ్ల నుండి గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న కృషి అలాంటిది మరి. అంతేకాదు ఆమె ఓ మహిళా హక్కుల కార్యకర్త. ఆ ప్రజల కోసం ఉపాధిని సష్టించడం, అవకాశాలను కల్పించడం కోసం నిరంతరం తపిస్తూనే ఉంటుంది. అంతేనా అక్కడి యువతతో మమేకమై పిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పిస్తున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
గ్రామీణ ప్రాంతాల్లో మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి చెబుతారా?
మేము ఇక్కడ మారుమూల గ్రామాల్లోని మహిళల కోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంతోపాటు, నీటి సంరక్షణ కోసం కూడా కృషి చేస్తున్నాము. అలాగే ఇంటి కోసం మహిళలు తయారు చేసే కళాఖండాలు, వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా వారిని పారిశ్రామికవేత్తలకు పరిచయం చేస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా సహాయ బృందాలతో కలిసి భీమ్‌తడి జాతర అనే సాంస్కతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. బాలికలు, మహిళలకు పీరియడ్స్‌ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం కోసం ‘సోబతి’ ప్రారంభించాం.
మిమ్మల్ని ప్రేరేపించిన సంఘటనలు?
అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌కు కార్యదర్శిగా మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని దాదాపు 40 కరువు ప్రభావిత గ్రామాలకు వెళ్ళాను. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అప్పుడే నాకు తెలిశాయి. కరువు కాలంలో మనుషులు, జంతువులు పడుతున్న బాధలు చూసి నీటి సంరక్షణ కోసం ఏమైనా చేసేలా నన్ను ప్రేరేపించాయి. నా కొడుకు సహకారంతో 80-90 గ్రామాలకు నీటి ట్యాంకర్ల తెప్పించగలిగాను. దాంతో పాటు గ్రామీణ మహిళల్లో రుతు పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలని భావించాను. ‘సోబతి’ సహకారంతో ఈ కమ్యూనిటీలలోని మహిళలకు విద్య, సాధికారత కల్పించడంలో చురుగ్గా పాల్గొంటున్నాను.
మీ కార్యక్రమాల తర్వాత గ్రామాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి?
‘సోబతి’ బాలికలకు ఐదవ తరగతి నుండి గ్రాడ్యుయేషన్‌ వరకు ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా రుతుక్రమ పరిశుభ్రతపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అమ్మాయిలకు ఇవేంతో ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యకరమైన విద్యతో పాటు, సమగ్ర అభివద్ధి, కెరీర్‌ ఎంపికలు చేసుకోవడంలో వారికి మార్గనిర్దేశం చేసేందుకు మేము కషి చేస్తున్నాము.
స్వయం సహాయక సంఘాలు సామాజికాభివద్ధికి తోడ్పడతాయంటారా?
స్వయం సహాయక సంఘాలు గ్రామల్లో మార్పుకు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో గ్రామాల్లో మహిళా పారిశ్రామికవేత్తల పెరుగుదలకు, ఆర్థిక స్వాతంత్య్రం పెరగడానికి ఇవే కారణం. ఆర్థిక స్వాతంత్య్రం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. కాబట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే నా లక్ష్యం. ఈ మహిళలు తమ వ్యాపారాలను ప్రారంభించడంతో పాటు ఇతరులకు కూడా అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి సామాజిక అభివద్ధిని పెంపొందించడంలో స్వయం సహాయ సంఘాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు.
వారితో పని చేసినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?
గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడం వల్ల విద్యుత్‌, నీటి కొరత వంటి నిరంతర సమస్యల పట్ల నాకు అవగాహన కలిగింది. నీరు, విద్యుత్‌ను ఆదా చేయడం, సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా వారిని ప్రోత్సహించడంలో నేను విజయం సాధించాను. ఫలితంగా గ్రామీణ మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స ఇప్పించగలుగుతున్నాం.
ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు, మీ దిన చర్య ఎలా ఉంటుంది?
అందరిలా ఇంటి పనులతోనే మొదలవుతుంది. అయితే నా వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా దృష్టి పెడతాను. ప్రతిరోజూ కచ్చితంగా వ్యాయామం చేస్తాను. ఉదయం పూట పాఠశాల, కళాశాలల నుండి వచ్చే సమస్యలను పరిష్కరిస్తాం. ఫీల్డ్‌ వర్క్‌ కోసం బయటకు వచ్చిన తర్వాత నా దష్టి పూర్తిగా తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై ఉంటుంది.
ఇన్ని కార్యమ్రాలు చేయడానికి ప్రేరణ ఏమిటి?
గ్రామీణ ప్రాంతంలో పెరగడం వల్ల మహిళలు, బాలికలు ఎదుర్కొం టున్న సవాళ్లతో నేను మమేకమయ్యాను. వారే నా ప్రేరణ. వారి కోసం మెరుగైన సమాజాన్ని సష్టించేందుకు వారే నన్ను నిబద్ధతతో నడిపిస్తున్నారు.
నేటి యువతకు మీరేం చెప్తారు?
రోజువారీ బాధ్యతలు మనకు ఎన్ని ఉన్నా ఇతరుల అవసరాలను గమనించడం, ప్రతిస్పందించడం చాలా అవసరం. సహాయం అవసరమయ్యే వారు మన చుట్టూ ఎందరో ఉన్నారని గుర్తించాలి. వారికి మన చేతనైన సహాయం అందించాలి. మనం చేసే సహాయం ఎంత చిన్నదైనా గణనీయమైన మార్పును కలిగిస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు వంటి నిపుణులు తమ నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా గ్రామీణ అభివద్ధికి దోహదపడవచ్చు. ఇది గ్రామీణ భారతదేశంలోని మహిళలు, యువతరం జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.
– సలీమ