దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం ‘నా ఉచ్ఛ్వాసం కవనం’. శతిలయ ఫౌండేషన్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారం కానుంది. తాజాగా ఈ ప్రోగ్రాం కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు కష్ణవంశీ ఈ వేడుకకు హాజరై టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ చెరువు మాట్లాడుతూ, ‘విశ్వనాథ్‌తో విశ్వనాథామతం అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు 2011లో సిరివెన్నెల సీతారామశాస్త్రిని కలిశాం. ఆయన సాహిత్యపరంగా రాసిన ఎంతో విలువైన పాటలు, ఆ పాటల వెనక ఆయన చేసిన కషి గురించి తెలుసుకున్న తర్వాత ఈ పాటలు మాకే కాదు అందరికీ తెలియాలనే ఆలోచన కలిగింది. సిరివెన్నెల అంతరంగం పేరుతో ప్రేక్షకులకు చేర్చాలి అనుకుంటున్నప్పుడు త్రివిక్రమ్ మాకు సపోర్ట్ చేశారు. ఈటీవీలో ప్రసారం గురించి బాపినీడు ఎంతో సపోర్ట్ చేశారు’ అని తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామ్ శాస్త్రి, సింగర్ పార్థసారధి, డాక్టర్ గురువారెడ్డి, దర్శకుడు కష్ణవంశీ, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు తదితరులు సిరివెన్నెల పాట ప్రస్థానం గురించి తెలిపారు.