నా అనుభ‌వాలే ‘హోమ్ లేస్’

my-experience-is-home-laceకె.వైశాలి… కాలేజీ చదివే రోజుల్లో తాను డైస్లెక్సిక్‌తో బాధపడుతున్నట్టు గుర్తించింది. అదే సమయంలో తన శరీరంలో అనేక మార్పులు గమనించింది. చివరకు తానొక లెస్బియన్‌ అని గుర్తించింది. సమాజానికి విరుద్దంగా ఉన్న కూతురి కోర్కెలను తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇక తన దారి వెదుక్కుంటూ అడుగుబయట పెట్టింది. ప్రేమించడం, విడిపోవడం, కోలుకోవడం, విద్యా వైఫల్యం, ఒంటరితనం, స్వలింగ సంపర్కం, అనారోగ్యం, ఆందోళన, నిరాశ ఇలా ఎన్నో సమస్యలతో ఆమె జీవితం మొదలయ్యింది. తన అనుభవాలన్నింటినీ ‘హోమ్‌లెస్‌’గా ముద్రించింది. అదే ఇటీవల కేంద్ర సాహిత్య యువపురస్కానికి ఎంపికయింది. బతికేందుకు సమాజంతో పోరాడి అక్షరాల్లో ఓదార్పు వెదుక్కొంటున్న ఆమెతో మానవి సంభాషణ…
నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని తిరుచునాపల్లి. మా అమ్మ మాలతీ కన్నన్‌, మ్యూచవల్‌ ఫండ్‌ ఇండిస్టీలో పని చేస్తోంది. నాన్న ఎన్‌.కన్నన్‌, ఎయిర్‌కండీషన్‌ డిజైనర్‌. ఆయనకు ఎక్కడ మంచి జాబ్‌ వస్తే మేమంతా అక్కడికి వెళుతుండేవాళ్ళం. అలా నేను చెన్నై, ఢిల్లీ, ముంబయిలో చదువుకున్నాను. నాకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. పదో తరగతి తర్వాత సీఏ చేద్దామనుకుని ఇంటర్‌ చేరాను. అయితే అంకెలు రివర్స్‌లో కనిపిస్తుండేవి. రాయడం కూడా ఇబ్బందిగా ఉండేది. తొమ్మిదిని ఆరులా ఆరుని తొమ్మిదిలా రాసేదాన్ని. పేర్లు కూడా తప్పుగా రాస్తుండేదాన్ని.
కొన్ని మార్పులు గమనించాను
చదువు మానేసి ముంబయిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాను. అయితే 19, 20 ఏండ్లు వచ్చేటప్పటికి నాలో నేను కొన్ని మార్పులు గమనించాను. అబ్బాయిలంటే అస్సలు ఇష్టముండేది కాదు. కాలేజీలో చేరినప్పుడు ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. నేను ఒక లెస్బియన్‌ అని తెలిసింది. ఆ అమ్మాయితో మూడేండ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నాకు 23 ఏండ్లు వచ్చిన తర్వాత ఈ విషయం మా అమ్మకు చెప్పాను. అస్సలు ఒప్పుకోలేదు. నాప్రవర్తన ఇంట్లో వాళ్ళకు నచ్చలేదు. నాతో మాట్లాడటం మానేశారు. ఇక వాళ్ళతో కలిసి ఉండలేక అహ్మదాబాద్‌ వెళ్లిపోయాను. నాతో పాటు రిలేషన్‌లో ఉన్న అమ్మాయి కూడా నాతో వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్య బ్రేకప్‌ అయ్యింది. ఆ టైంలో ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు పడ్డాను. బతకడం కోసం ఆఫీస్‌బారుగా పని చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో మాస్టర్స్‌ చేద్దామని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో కమ్యూనికేషన్‌ కోర్సు కోసం అప్లరు చేశాను.
గందర గోళంగా మారింది
హైదరాబాద్‌లో సీటు రావడంతో ఇక్కడే హాస్టల్లో చేరాను. నాకున్న డైస్లెక్సిక్‌ సమస్య గురించి చెప్పినప్పుడు యూనివర్సిటీ వాళ్లు బాగా అర్థం చేసుకున్నారు. కానీ నేను ఒక లెస్బియన్‌ అని ఎవరికీ చెప్పుకోలేను. నా గురించి మిగిలిన వారు ఏమనుకుంటారో అనే భయం ఉండేది. ఒక పక్క ఇంట్లో పెండ్లి చేసుకోమని గొడవ మొదలుపెట్టేవాళ్లు. ఓ సాధారణ అమ్మాయిలా పెండ్లి చేసుకోవడం నా వల్ల కావడం లేదు. నా పరిస్థితి చాలా గందర గోళంగా మారింది. నేను ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం నా ఒక్క దానివే కావని తెలుసుకున్నాను. నాలా చాలా మంది సాధారణ జీవితం గడపలేక, కుటుంబంతో ఇమడలేక, సమాజంతో మసలలేక మానసికంగా కుంగిపోతున్నారు.
నా ఉనికిని దాచుకున్నాను
నా తప్పులేకుండానే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. చాలా కాలం నా ఉనికిని దాచుకోవల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాసిన హోమ్‌లెస్‌ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. నాలాంటి వారే కాకుండా అనేక మంది దీన్ని చదివి తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో ఓ పురస్కారం వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఈ పుస్తకం మరింత మందికి చేరువవుతుంది. నాలాంటి వారి జీవితాల గురించి ప్రజలు అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎనిమిదేండ్ల నుండి హైదరాబాద్‌లోనే నా పార్ట్‌నర్‌తో కలిసి జీవిస్తున్నా. ప్రస్తుతం టెక్నికల్‌ రైటర్‌గా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాను. ఆఫీస్‌లో నా గురించి అందరికీ తెలుసు. అయినా ఎలాంటి సమస్యా లేదు. ఇప్పుడు జీవితం చాలా బాగుంది. మాస్టర్స్‌ పూర్తి చేశాను. సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాను.
ఇంకా చాలా రాయాలి
పుస్తకం రాసేటప్పుడు అమ్మ వాళ్ళకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది నా జీవితం. వాస్తవాలు రాస్తున్నాను. అంటే మా అమ్మానాన్నలు గురించి కూడా ఇందులో ఉంటుంది. అందుకే నేను ఈ పుస్తకం రాస్తున్నానంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది రావడం అంత సులభం కాదని వాళ్లకు తెలుసు. ఇప్పుడు నా పుస్తకం ఎంతో మందికి అవగాహన కల్పిస్తుందని వాళ్లు కూడా ఆనందిస్తు న్నారు. ఇంకా పుస్తకాలు రాయాలను కుంటున్నాను. నాతో పాటు ఇంకా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జీవితాలను ఓ పుస్తకంగా తీసుకొస్తాను. వాళ్ళ బాధలు, కష్టాలు, పోరాటాలు సమాజానికి తెలియజేస్తాను. అలాగే ఒక నవల కూడా రాయాలనుంది. ఇలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి.
ఎవరి జీవితం వారిది
మేము కూడా మనుషులమే అని అందరూ గుర్తించాలి. అవకాశాలు ఇవ్వకుండా అంటరాని వాళ్లలా చూడడం కరెక్ట్‌ కాదు. ఒక అమ్మాయికి పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆమె ఆలోచనలు తేడాగా ఉన్నాయని అనుకోవద్దు. ఆమె జీవితం ఆమెకు నచ్చినట్టు జీవించనియ్యాలి. ఒక అమ్మాయి, మరో అమ్మాయిని ఇష్టపడితే అది ఆమె ఇష్టం. నావరికి నేను వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం లేదు. నా బతుకు నేను బతుకుతున్నాను. కనుక ఎవరి జీవితం వారిని జీవించనిస్తే చాలు. ఎలాంటి సమస్యలూ ఉండవు. యువత కూడా తమ చేతుల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి సమాజ మార్పు కోసం ప్రయత్నించాలి. ఇతరులకు సాయం చేయడం అలవర్చుకోవాలి. అందరినీ సమానంగా గౌరవించాలి. దీనికి అధ్యయనం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను.
ఎవ్వరూ సపోర్ట్‌ చేయలేదు
నా సమస్య ఏంటని గూగుల్లో కొంత సర్చ్‌ చేశాను. ఓ గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు వెళ్ళి చెకప్‌ చేయించుకున్నా. నాకు డైస్లెక్సిక్‌ అనే సమస్య ఉందని బయటపడింది. అంటే ‘తారే జమీన్‌ పర్‌’ సినిమాలోని అబ్బాయికి ఉన్న సమస్య అన్నమాట. ఇంటర్‌ మంచి మార్కులతోనే పాసయ్యాను. కానీ నాకున్న సమస్యతో సీఏ ఫీల్డ్‌లో కొనసాగడం కష్టం. అందుకే బీకాం చేసి ఎమ్మె ఎకనామిక్స్‌ తీసుకున్నాను. అయితే అక్కడ కూడా గ్రాఫ్‌ గీయడం, చదవడం చాలా సమస్య అయ్యింది. నాలాంటి సమస్య ఉన్న వారికి పరీక్షలు రాయడానికి సహాయం చేయానికి ప్రత్నామ్యాయం గురించి యూజీసీ నుండి ఎలాంటి గైడ్‌లైన్స్‌ లేవు. కాలేజీలో ఎవ్వరూ సపోర్ట్‌ చేయలేదు. దాంతో ఫస్ట్‌ సెమిస్టర్‌ ఫెయిల్‌ అయ్యి ఆ కోర్సు కూడా మానేయాల్సి వచ్చింది.
మా సమస్యలు తెలియాలని
యూనివర్సీటీకి వచ్చిన తర్వాత ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. తన ప్రోత్సాహంతోనే రాయడం మొదలుపెట్టాను. మొదట్లో ‘హాట్‌ ఆఫ్‌ యు’, ‘బ్లో’ వంటి కొన్ని చిన్న కథల రాశాను. ఓ నవల కూడా రాశాను కాని దానికి పెద్ద గుర్తింపు రాలేదు. మాలాంటి వారి సమస్యలు సమాజానికి తెలియజేయాలని నా జీవితంలో ఎదురైనా అనుభవాలన్నింటినీ కలిపి
2023లో ‘హోమ్‌లెస్‌’ అనే పేరుతో పుస్తకంగా రాశాను. ఇది గత ఏడాది పబ్లిష్‌ అయ్యింది. ఇప్పుడు దీనికి కేంద్ర సాహిత్య యువ పురస్కారం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
– సలీమ