”మననం లేకుంటే త్యాగాలు ఖననం అవుతాయి” అనే వాస్తవాన్ని దా.రా (దామెర రాజేందర్) గుర్తించినట్లు ఉన్నారు. అందులో భాగంగానే ప్రజల కోసం తమ జీవితాలను కొవ్వొత్తిలా కరిగించుకున్న 14 మంది త్యాగధనులను దా.రా మననం చేశాడు. 15 వ్యాసాలతో మరణ సందేశాన్ని అందించాడు. తన కుటుంబం కోసం కాకుండా ఇతరుల కోసం, ఈ సమాజం కోసం శ్రమ చేసిన వారు చరిత్రలో నిలబడతారు. భౌతికంగా మరణించినప్పటికీ జన హృదయాల్లో చిరస్మరణీయులుగా దారిదీపాలుగా వెలుగుతుంటారు. మరణాంతర జన్మ అంటే యిదే. ఇదియే పునర్జన్మ. ‘మరణం తర్వాత జీవం ఉంటుందా?’ అనేది అసలు ప్రశ్న కాదు, ముందు నీవు సజీవంగా ఉన్నావా? అనేది అసలు ప్రశ్న.
కంటికి కనిపించిన లోకమే ఈ ప్రపంచ మానవాళి. శ్రామిక వర్గం ఒకవైపు, దోపిడీ వర్గం మరోవైపు కొనసాగుతున్న సమాజ పరిణామ క్రమంలో సమాజమంతా వర్గ పోరాటాల మయంగానే వుంది. నూతన సమాజ ఆవిష్కరణ కోసం, దోపిడీ వివక్ష అసమానతల్లేని ఉదయం కోసం ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి ఉద్యమ దారుల్లోంచి నడిచొచ్చిన స్వాప్నికుడు దా.రా 64 పేజీల చిరుపొత్తంలో మరణ సందేశాన్ని వినిపించాడు.
ప్రపంచ గమనాన్ని మార్క్సిస్టు దృక్పథం నుంచి అర్ధం చేసుకుని జర్నలిస్టుగా, ఆక్టివిస్టుగా జమిలి పయనంతో ప్రత్యేక ముద్ర వేయగలిగాడు. సమాజాన్ని ప్రభావితం చేసిన 14 మందిని తన శైలిలో పరిచయం చేస్తూ రాజ్యంపై ఒక రకంగా అక్షర యుద్ధాన్ని ప్రకటించాడు. అది నిశబ్ధ యుద్ధం లాంటిది. అక్షరాలు మాట్లాడుతాయి. పోట్లాడుతాయి. కదన రంగాన్ని ఎరుపెక్కిస్తాయి. పుట్టుక – మరణం మధ్యలో మిగిలిన జీవన యుద్ధక్షేత్రాన్ని ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పేదిగా మరణ సందేశంగా సాగింది. గల్లీలో ఉన్న లచ్చవ్వ, కౌసల్యమ్మ, రౌతు మనోహార్, వెంకటయ్య నుంచి మొదలై ప్రపంచాన్ని ప్రభావితం చేసిన నెల్సన్ మండేలా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వరకూ మహోన్నతుల జీవితాలను అక్షరీకరించాడు. వాటిని జ్వలింప చేశాడు. రేపటి వెలుగు కోసం నేటి చీకటిని అనుభవించిన బాలగోపాల్ సార్ ను సందర్భోచితంగా ప్రస్తావించి ‘ఇప్పుడు మనుషులను వెతుక్కోవాలి’ అంటాడు. వారి కృషిని, స్ఫూర్తిని, వాస్తవికతను విశేషంగా చెప్పాడు.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ‘ఆయుధాలు లేని ప్రపంచాన్ని కాంక్షిద్దాం’ రండి పిలుపు నిచ్చాడు. ప్రపంచ శాంతిని కాంక్షించాల్సిన అవసరాన్ని అక్షర దివిటీగా ఎత్తిపెట్టాడు. హిందూ మూక దాడిలో హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ తత్వాన్ని రాస్తూ ‘నాలుగో స్తంభాన్ని నిటారుగా నిలబెట్టుకోవాలి’ అంటాడు. కత్తుల వంతెనపై వేలాడుతున్న మీడియా స్థితిని గౌరీ లంకేష్ తత్వాన్ని, సాహసోపేతమైన దృక్పథాన్ని విశ్లేషించాడు. ‘కనిపించే నిజాల ఆవల ఉన్న అసలు అంశాలు ఏంటో చెప్పగలిగేలా జర్నలిస్టుల దృష్టి కూడా ఉండాలని’ భావించే దా.రా, అక్షర శిఖరం షోయబుల్లాఖాన్ హత్యోదంతంపై రాశాడు. ‘రాచరికపు రోతలపై షోయబ్ రాతలు’ గా చెప్పుకొచ్చాడు. అక్షర సైనికులకి షోయబ్ కొనసాగించిన స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలనే స్పృహ కలిగి ఉండాలి, అదే ఆయనకు నివాళి అంటాడు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, ఈ శతాబ్దపు వీర వనిత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మరణించినప్పుడు దా.రా అప్పటికప్పుడు స్పందించాడు. ఆమె మరణాన్ని వేడుకలా చూడాలని, అంతిమయాత్రను ఒక జైత్రయాత్ర లాగా సాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ యాత్ర పండుగలా జరగాలి, అలెగ్జాండర్ శవయాత్ర జరిగినట్లు మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర ఉండాలి అన్నాడు. దిక్కార కవి కలేకూరి ప్రసాద్ జీవితం గురించి చెబుతూ కొత్త లోకంలోకి తొంగి చూసే వారంతా కచ్చితంగా కలేకూరి ప్రసాద్ లాగే జీవించాలి అన్నాడు. ఆయనను సరిగ్గా అర్థం చేసుకుంటే నూతన ప్రపంచం వైపు అడుగులు వేయడానికి వీలవుతుందని చెప్పే సాహసం చేశాడు రచయిత. ప్రపంచ శ్రామిక జన పండుగ మే డే గూర్చి స్ఫూర్తివంతమైన పత్రాన్ని అందించాడు. మే డే వెలుగులను తన అక్షరాల్లో పొందుపరిచాడు.
ఇక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి రాస్తూ ‘అంబేద్కర్ కు నివాళి అంటే..: ఏంటి అని సూటిగా ప్రశ్నించాడు. అంబేద్కర్ వాదులు, దళిత బహుజనులు ఏం చేయాలి? ఆచరణ వైపు ఎలా నిలబడాలి? అనే అంశాలపై చర్చ చేశాడు. మరో వ్యాసంలో అంబేద్కర్, నెల్సన్ మండెలా గూర్చి విశ్లేషణ అందించాడు. ఝార్ఖండ్ హక్కుల పోరాటయోధుడు ఫాదర్ స్టాన్ స్వామి మరణం ‘భయానక భవిష్యత్తుకు సంకేతం’ అని, ఒక హెచ్చరిక అని ప్రకటించాడు. ఆయన ఉద్యమ నేపథ్యం, రాజ్యం అతని పట్ల వ్యవహరించిన అమానవీయ తీరును, ఆయనపై పెట్టిన రాజద్రోహం కేసును వివరించాడు. ఆయన మాదిరే తెలంగాణలో ఈ పుస్తక రచయిత ఉమ్మడి వరంగల్ జిల్లాలో సహజ వనరుల పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసి మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటాల్ని, రాతలను కొనసాగించాడు. ఫలితంగా స్వరాష్ట్ర పాలకులచే ఉ.పా కేసు మోపబడి వంద రోజులు జైలు జీవితం గడిపాడు.
చివరి మాట అనుబంధంగా చేర్చాడు. అందులో తన నాయిన దామెర మొగిలి గూర్చి.. తను అర్థం చేసుకున్న తీరును, సమాజం పట్ల ఆయనకున్న దృక్పథాన్ని, నడవడికను నెమరు వేసుకున్నాడు. మొత్తానికి ఈ పుస్తకం అధ్యంతం చదివిస్తోంది. ఆలోచింపచేస్తుంది. సగటు మనిషి ఈ వ్యవస్థలో ఎలా బతకాలో.. ఎలా బతకవద్దో.. అర్థం చేసుకోవడానికి మరణ సందేశం వీలు కల్పించింది. ఇది అరుదైన పుస్తకం.
-మామిండ్ల రమేష్‌రాజా, 7893230218
నాకు నచ్చిన పుస్తకం మరణానంతర జీవితం – మరణ సందేశం
10:52 pm