నా గల్మల కాలు వెట్టలేదు..

కంటి నిండా నిదురపోదామంటే
కష్టాలన్నీ దోమల్ల కుట్టి నిద్రలేపుతున్నవ్‌..
ఇక నెత్తికింది దిండేమో నీ కన్నీళ్ళ బరువు
ఇక నేను మోయలేన్నటుంది…
అరికాళ్ళ వణుకేమో నేను లేచి ఒక్క అడుగు కూడా వేయనని మొండికేస్తుంటే….
ఆ గది గోడలు మాత్రం నన్ను బంధించానని వెకిలి నవ్వులు నవ్వుతున్నయి..
సందు దొరికిందని ”ఓటమి”
నా దుప్పట్లో దూరి నన్ను కౌగిలించుకుంటే…
”గెలుపు” మాత్రం దాని నీడ కూడా
కనిపించనంత దూరంలో ఉంది..
అది ఎవరి ఇంట్లో సేద తీరుతుందో కానీ..
ఒక్క పూట కూడా నా గల్మల కాలువెట్టలేదు..
దానికి లంచం ఇచ్చుకోలేని పేదరాలిని నేను..
మభ్య పెట్టి రమ్మనే అంత మాటకారిని కూడా కాకపోతిని..
తెల్లారితే దుఃఖం నా గది తలుపులు కొట్టి లేపితే..
నా చేతి గాజుల శబ్దం నాకు దైర్యమిస్తే..
నా ఎంటికల శిక్కుల ముడి విప్పుకున్నట్లు నా కష్టాల ముళ్లను విప్పుకుంట..
నా తెగువను ఆరు గజాల చీరల కట్టుకుంట..
గెలుపు నా ఇంటికి వచ్చే ఒక చుట్టమనుకొని..
కష్టాల్ని కన్నబిడ్డల్ల చూసుకుంట..
ఎందుకంటే నేను ఆడదాన్ని..
అందులో ఒక అమ్మను కాబట్టి..
మాకు లాలించడమే వచ్చు తప్ప..
ద్వేషించడం రాదే..
వాళ్ళు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలైన..
మా కాళ్ళ కాడికచ్చిన కష్టాన్నైన..
కళ్ళకద్దుకుంటం..
కడుపుల పెట్టుకుంటం..
– తుమ్మల కల్పన రెడ్డి, 9640462142