నా దీక్ష ప్రజల కోసమే…

– చంద్రబాబు ప్రజల మనిషి
– నిరసన దీక్ష సభలో నారా భువనేశ్వరి
– సెంట్రల్‌ జైలులో చంద్రబాబు ఒక్క రోజు నిరసన దీక్ష
రాజమహేంద్రవరం : తన దీక్ష చంద్రబాబు కోసమో, తన కుటుంబం కోసమో కాదని, రాష్ట్ర ప్రజల కోసమని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ‘సత్యమేవ జయతే’ పేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్‌ వద్ద సోమవారం ఆమె ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఇదే సమయంలో సెంట్రల్‌ జైలులో చంద్రబాబు ఒక్కరోజు నిరశన దీక్షకు దిగారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా వైద్య బృందాన్ని జైలు అధికారులు అందుబాటులో ఉంచినట్లు సమాచారం. తొలుత గాంధీ విగ్రహానికి, ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి భువనేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో ఆమె కూర్చొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.10 గంటలకు వరకు దీక్ష కొనసాగించారు. సాయంత్రం 5.19 గంటలకు చిన్నారుల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జనసేన పార్టీ మహిళా నేతలు, టిడిపి మహిళా నేతలు భువనేశ్వరికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా తాను దీక్ష చేశానన్నారు. తన తండ్రి, తన భర్త అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు. అధికారంతో తమకు పనిలేదని, తమపని తాము చేసుకుంటూ వెళ్తామని అన్నారు. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని పేర్కొన్నారు. తామందరినీ అరెస్టు చేసినా కార్యకర్తలు టిడిపిని నడిపిస్తార న్నారు. మహిళల మద్దతు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, చంద్రబాబు ఉంటే తమ బతుకులు బాగుంటాయనే నేడు మహిళలు బయటకు వచ్చారని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తా చంద్రబాబు అరెస్టు వల్ల 105 మంది మృతి చెందారని, ఆ కుటుంబాలను తాను స్వయంగా పరామర్శిస్తానని భువనేశ్వరి తెలి పారు. ‘నిజం గెలవాలి’ అనే స్లోగన్‌తో ప్రజలు కలిసి రావాలని కోరారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ మాట్లాడుతూ భువనేశ్వరి పోరాటం విజయం కావాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం ప్రమా దంలో పడిందనడానికి చంద్రబాబు అరెస్టే సాక్ష్యమ న్నారు. మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభా భారతి, మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత, మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు.