ఈ కలలు నిజం కాకుంటే బాగుండనిపిస్తుంది
మొదటి కల
ఒకడు నేను హిందువును అన్నాడు
మరొకడు నేను మైనారిటీ అన్నాడు
ఈ రెండు కాని వాడు దళితుడిని అన్నాడు
అస్తిత్వం నిద్రలేచింది
వాళ్లు ముగ్గురు చీలిపోయారు
రెండవ కల
ఒకడు మీరు నల్ల వాళ్ళన్నాడు
ఇంకొకడు మీరు తెల్లవాళ్ళన్నాడు
అస్తిత్వం మరో రూపంగా మారింది
దేశం ఉత్తర దక్షిణభారత్ గా చీలిపోయింది
మూడవ కల
ఒకడు మా రాజవంశం గొప్పన్నాడు
మరొకడు మా వంశమే గొప్పన్నాడు
అస్తిత్వం తన రూపాన్ని మార్చుకుంది
దేశంలో మళ్ళీ వందలాది రాజవంశాలు తలెత్తాయి
నాలుగవ కల
ఒకడు మనది ద్వైతం అన్నాడు
మరొకడు అద్వైతం అన్నాడు
అస్తిత్వం మళ్లీ తన రూపాన్ని మార్చుకుంది
మతం బౌద్ధం శైవం వైష్ణవంగా చీలిపోయింది
ఐదవ కల
ఒకడు మా ఆచారమే గొప్పన్నాడు
మరొకడు లేదు మాదే గొప్పన్నాడు
అస్తిత్వం మళ్లీ తన రూపాన్ని మార్చుకుంది
దేశం కులాలు తెగలుగా విడిపోయి
అస్తిత్వాల రొచ్చులో పోర్లాడుతుంది
ఆరవ కల
ఇప్పుడు ఇస్లాం లేదు
క్రైస్తవం లేదు హైందవం లేదు
ఉన్నదల్లా చిన్న చిన్న రాజ్యాలు
అన్ని రాజ్యాల్లోఒకటే సనాతన ధర్మం
ఇంకేముంది
కత్తుల అవసరం కమండలాలకు
కమండలాల అవసరం కత్తులకేర్పడింది
అలా పాలకుల్ని ప్రవక్తల్ని ఐక్యం చేస్తూ
దేశాలు ఎన్నయితేనేమోరు
దోపిడి ఒకటైతే చాలు
అంటూ మనుధర్మం మళ్లీ దర్శనమిచ్చింది
అధర్మం ధర్మం పేరుతో రాజ్యమేలుతుంది
ప్రజలకు మిగిలింది
ఇది నా కర్మ ఇదింతే
అన్న ఓదార్పు ఒక్కటి మాత్రమే
కల చెదిరింది
కళ్ళు తెరచి చూస్తే
ఎదురుగా సూర్యుడు
ఎర్రగా మెరుస్తున్నాడు
నా అవసరాన్ని అర్థం చేసుకోమంటూ
– ఏబూషి