బతుకమ్మ బతుకమ్మ.. మల్లీయల్లో
బంగారు బతుకమ్మ.. మల్లీయల్లో
బతుకునిచ్చే తల్లి.. మల్లీయల్లో
మా తల్లి బతుకమ్మ.. మల్లీయల్లో
తీరొక్క పూలతో.. మల్లీయల్లో
నిన్ను కొలిచేమమ్మ.. మల్లీయల్లో
రామన్నపేటలో.. మల్లీయల్లో
మా ఇంట కొలువయ్యి.. మల్లీయల్లో
చల్లంగ బతుకమని.. మల్లీయల్లో
మమ్ము దీవించమ్మ.. మల్లీయల్లో
ఆడబిడ్డాలంత.. మల్లీయల్లో
పుట్టింటికొచ్చిరీ.. మల్లీయల్లో
తీరొక్క పూలకై.. మల్లీయల్లో
సెట్టు పుట్ట తిరిగి.. మల్లీయల్లో
గుణముతో తెంపిరీ.. మల్లీయల్లో
ఘనమైన పూలనూ.. మల్లీయల్లో
రంగు రంగుల పూలు.. మల్లీయల్లో
రాసులుగ తెచ్చిరీ.. మల్లీయల్లో
ఇంపైన పూలతో.. మల్లీయల్లో
ఇల్లు వనంగ చేసి.. మల్లీయల్లో
పేర్చిరీ బతుకమ్మ.. మల్లీయల్లో
గుమ్మడాకులు పెట్టి.. మల్లీయల్లో
గునుగు తంగేడులూ.. మల్లీయల్లో
బంతి చేమంతులూ.. మల్లీయల్లో
గన్నేరు మల్లేలు.. మల్లీయల్లో
పట్టుకుచ్చుల పూలు.. మల్లీయల్లో
కూర్చి పేర్చినారు.. మల్లీయల్లో
పసుపు ముద్దగ జేసి.. మల్లీయల్లో
చేతులెత్తీ మొక్కిరి.. మల్లీయల్లో
గౌరమ్మగ నిను కొలిచి.. మల్లీయల్లో
మా యింటి గౌరమ్మై.. మల్లీయల్లో
చల్లంగ జూడమ్మ.. మల్లీయల్లో
మమ్మేలు మాతల్లి.. మల్లీయల్లో
మమ్ము దీవించమ్మ.. మల్లీయల్లో
చెరువు గట్టు మీద.. మల్లీయల్లో
పూల యేరులయ్యె.. మల్లీయల్లో
సిరుల ధారలయ్యే.. మల్లీయల్లో
ఆటజూడా తరలే.. మల్లీయల్లో
ఆది దేవతలూ.. మల్లీయల్లో
రంగూల సింగిడీ.. మల్లీయల్లో
సూడా తారాలొచ్చె.. మల్లీయల్లో
తొమ్మిది రోజులు.. మల్లీయల్లో
అంబరామంటేనూ.. మల్లీయల్లో
ఒకటవ రోజున.. మల్లీయల్లో
ఎంగిలి పూలతో.. మల్లీయల్లో
రెండవరోజున.. మల్లీయల్లో
అటుకుల నైవేద్యం.. మల్లీయల్లో
మూడువ రోజున.. మల్లీయల్లో
ముద్దపప్పుతోని.. మల్లీయల్లో
నాల్గవ రోజున.. మల్లీయల్లో
నానేసిన బియ్యం.. మల్లీయల్లో
ఐదువ రోజూన.. మల్లీయల్లో
అట్ల బతుకమ్మగ.. మల్లీయల్లో
ఆరవ రోజున.. మల్లీయల్లో
అలిగిన బతుకమ్మ.. మల్లీయల్లో
ఏడవ రోజూన.. మల్లీయల్లో
వేప నైవేద్యం.. మల్లీయల్లో
ఎనిమిదవ రోజున.. మల్లీయల్లో
వెన్నముద్దలతోటి.. మల్లీయల్లో
తొమ్మిదవ రోజున.. మల్లీయల్లో
సద్దుల బతుకమ్మ.. మల్లీయల్లో
తొమ్మిది రోజుల పాటు.. మల్లీయల్లో
నైవేద్యాలానిచ్చి.. మల్లీయల్లో
బతుకమ్మలెత్తిరి.. మల్లీయల్లో
పిల్లా పెద్దాలంత.. మల్లీయల్లో
బతుకమ్మలా చుట్టూ.. మల్లీయల్లో
సంతోషముగా చేరి.. మల్లీయల్లో
బతుకమ్మ ఆటలే.. మల్లీయల్లో
బాగుగా ఆడిరీ.. మల్లీయల్లో
పరవశించీపోయి.. మల్లీయల్లో
పాటలే పాడిరీ.. మల్లీయల్లో
నవ దుర్గ రాత్రులూ.. మల్లీయల్లో
నవ్యముగ జేసిరీ.. మల్లీయల్లో
మా ఊరి సెరువూ.. మల్లీయల్లో
రామన్నపేటసెరువు.. మల్లీయల్లో
పూలతోటి మెరిసె.. మల్లీయల్లో
సద్దుల నైవేద్యం.. మల్లీయల్లో
సంబురంగాతింటం.. మల్లీయల్లో
గంగగౌరినిజూడ.. మల్లీయల్లో
శివుడే తరలి వచ్చె.. మల్లీయల్లో
పోయిరావమ్మా మల్లీయల్లో
మాతల్లిగౌరమ్మ.. మల్లీయల్లో
మళ్ళీ యేడాదికి.. మల్లీయల్లో
మము జూడ రావమ్మ.. మల్లీయల్లో
మళ్ళీ యేడాదికి.. మల్లీయల్లో
మము జూడ రావమ్మ.. మల్లీయల్లో
– పాల్వంచ హరికిషన్, 9502451780