తమ్మినేనికి తీవ్ర అస్వస్థత

Tammineni– గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది
– హైదరాబాదుకు తరలింపు.. గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స
– నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం
– పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
– పరిస్థితులను సమన్వయం చేస్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్న తమ్మినేని సోమవారం మధ్యాహ్నం నుంచి ఆయాస పడుతుండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. మంగళవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తమ్మినేనిని తరలించారు. అక్కడ ఆయనకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు గురైన విషయం తెలిసి సీపీఐ (ఎం) శ్రేణులతో పాటు వివిధ పార్టీల నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. తమ్మినేనిని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో పాటు పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసిన వారిలో ఎస్‌.వీరయ్య, జి.నాగయ్య, చుక్కరాములు, టి. సాగర్‌, పాలడుగు భాస్కర్‌, డిజి నరసింహారావు, పి.ప్రభాకర్‌, జాన్‌ వెస్లీ, ఎండీ అబ్బాస్‌, భూపాల్‌, తదితరులు ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు కూడా తమ్మినేనిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో తమ్మినేని ఆరోగ్య పరిస్థితిని గురించి డాక్టర్లతో సంప్రదించి వైద్యాన్ని అందించడానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, డీజీ నరసింహారావు, పి.ప్రభాకర్‌ అందుబాటులో ఉంటూ కో ఆర్డినేట్‌ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని, అధైర్యపడొద్దని పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఐసీయూలో ఉన్నందున ఆస్పత్రికి ఎవరూ రావొద్దని డాక్టర్లు తెలియజేశారు.

విషమంగానే ఉంది..
– బులెటిన్‌ విడుదల చేసిన ఏఐజీ ఆస్పత్రి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఖమ్మం నుంచి వెంటిలేటర్‌ సాయంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు.
– ఆయన గుండె సరిగా పని చేయడం లేదు.
– హృదయ స్పందన అసాధారణంగా ఉంది.
– మూత్రపిండాల పనితీరు కూడా సరిగా లేదు.
– ఈ కారణాలతో ఆయన ఊపిరితిత్తులలో నీరు చేరింది.
– ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన అవసరం ఉంది.
– ఆయన రక్తపోటును సాధారణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
– ఊపిరితిత్తుల నుంచి నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
– అసాధారణంగా ఉన్న హృదయ స్పందనను సరిచేసేందుకు చికిత్స జరుగుతోంది.
– డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ డీఎన్‌ కుమార్‌ పర్యవేక్షణలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, పల్మనాలజిస్టులతో కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఆయన పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నదని, ఆయనకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం
– గచ్చిబౌలిలోని ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు