నా ఈ దేశపు చరిత

నా ఈ దేశపు చరితఓ మా గణిత దైవమా..
మా మరో శ్రీరామ నామమా
సంఖ్యలలో నీకు
సత్యం దర్శించిందేమో!
గణితం ప్రాణం పోసుకొని
నీ గుండె గా మారిందేమో!

అంకెలపై నీ ‘అనంతం’ ప్రభావాన్ని
శతాబ్దం దాటిన అర్థంచేసుకోని
ఈ ఆధునిక ప్రపంచపు
అద్వితీయ పరిజ్ఞానాన్ని
నా అక్షర ప్రవాహపు
దాహం ఏం రాయగలదు?
నా అరుణోదయ భౌతికశాస్త్ర
ప్రకాశం ఏం చూపగలదు?

కడు పేదరిక సమరంలో..
చిత్తు కాగితాలపై కొహినూర్‌
వజ్రం లాంటి నీ లెక్కల రాతలు..
విశ్వ మేధావులకే అంతుచిక్కని అద్భుతాలు..!

మూడు పదులు దాటగానే అస్తమించి..
ఈ విశ్వపు జ్ఞానాన్ని ఆకర్షించి..
నీ ప్రశ్నలన్నీ పరిశోధనలు అవుతుంటే..
”నిన్ను కనడమే..
నిన్ను కనుగొనడమే..”
నా ఈ భారతదేశపు చరిత..!
నువ్వే నవ యువ మా గణిత కవిత..!
(శ్రీనివాస రామానుజన్‌కు అక్షర నివాళితో..)

– ఫిజిక్స్‌ అరుణ్‌కుమార్‌, 9394749536