నా బలం.. బలగం.. ప్రజలే..

నా బలం.. బలగం.. ప్రజలే..– బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదు
– అభివృద్ధి అంటేనే సిద్దిపేట
–  రోడ్‌ షోల్లో మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ – సిద్దిపేట, చేగుంట
‘నా కుటుంబం సిద్దిపేట అని, ప్రజలే నా కుటుంబ సభ్యులని, సిద్దిపేట ప్రజలే నా బలం.. నా బలగం..’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధి అంటే సిద్దిపేట అని, ఎలాంటి అభివృద్ధి చేయని బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. సిద్దిపేటతో పాటు చేగుంటలో మంగళవారం నిర్వహిం చిన రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ప్రతిసారి మెజార్టీ పెంచుతూ తనను గెలిపించారని, ఈ జన్మ మీకే అంకితం అని తెలిపారు. పార్టీ కోసం ప్రచారం చేయమని తనని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాలకు పంపించారని, తాను లేకున్నా మీరే ముందుండి గ్రామగ్రామాన నా తరఫున ప్రచారం చేశారని, మీ ప్రేమ వెలకట్టలేనిదన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమైందని, తెలంగాణ రావడంతోనే సిద్దిపేట జిల్లా అయిందని, రైలు వచ్చిందని, గోదావరి జిల్లాలు తెచ్చుకున్నామని చెప్పారు. తాగునీటికి గోసగా ఉన్న సిద్దిపేట జిల్లాకు, రెండు పంటలు పండే విధంగా సాగునీటిని తెచ్చుకున్నామన్నారు. ప్రతిపక్షాలు విమ ర్శలు చేస్తే మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. 60 ఏండ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలన్నారు. అసైన్డ్‌ భూములున్న ప్రతి ఒక్క రైతుకు పట్టా హక్కులు కల్పించి, వారికి పూర్తి స్వతంత్రాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు అండగా ఉండేది గులాబీ జెండా.. కారు గుర్తు అని అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో ప్రజలందరూ పాల్గొని, పోలింగ్‌ శాతం పెంచాలని, దేశంలో మారుమోగే విధంగా మెజార్టీ తీసుకురావాలని తెలిపారు.