నా గెలుపు లక్షలాది మంది ఆకాంక్ష

నా గెలుపు లక్షలాది మంది ఆకాంక్ష– అసమానత్వం ఉన్నంతకాలం పోరాటం తప్పదు
– చట్టసభల్లో ప్రజల గొంతుకనవుతా : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావు
– ఖమ్మంలో భారీ విజయోత్సవ ర్యాలీ
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉద్యమ పార్టీ తరపున తాను గెలవాలని కోరుకున్నారని, వారి ఆకాంక్షే కొత్తగూడెంలో తన గెలుపని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. కూనంనేని సాంబశివరావు గెలుపును పురస్కరించుకొని ఖమ్మంనగరంలో మంగళవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీ గార్డెన్స్‌లో ఆపార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన అభినందన సభలో కూనంనేని మాట్లాడారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై వారి గొంతుక వినిపిస్తానన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన చూసిన తరువాత ఎలాగైనా ఈ దుర్మార్గపు పాలనను అంతం చేయాలని ప్రజలు భావించారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ భావజాలం అధికంగా ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి ఏకపక్ష విజయం లభించిందన్నారు.
బొగ్గుగని ప్రాంతాల్లో కమ్యూనిస్టుల పోరాట ప్రాంతాల్లో ఘననీయమైన ఆధిక్యత లభించిందన్నారు. కాంగ్రెస్‌, సీపీఐ పొందికతతో సానుకూల ఫలితాలొచ్చాయన్నారు. ఒక స్థానం తీసుకొని పొత్తు కుదుర్చుకునే విషయంలో కొంత తటపటాయించినా.. కమ్యూనిస్టుపార్టీ ఉద్యమ అభిమానులు, శ్రేయోభిలాషులు చట్టసభల్లో కమ్యూనిస్టు గొంతుక కావాలంటే తప్పదని సూచించారని, వారి ఆకాంక్షలకనుగుణంగానే ఫలితం వచ్చిందని తెలిపారు. సీపీఐ(ఎం) సైతం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని బలపరిచిందని, సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కాంగ్రెస్‌ను బలపరిచే విషయాన్ని బహిరంగానే వెల్లడించారన్నారు.
ఓట్లు తగ్గినా భావజాలం పదిలమేనని, కమ్యూనిస్టుల శక్తిని మారిన ఎన్నికల రాజకీయాల్లో ఓట్లతో పోల్చవద్దని సూచించారు. కమ్యూనిస్టులెప్పుడూ రాజకీయ వృత్తిని పవిత్రంగానే చూస్తారని, పదవుల కోసం, ఆర్థిక వ్యవహారాల కోసం రాజకీయాలు చేయరని, ప్రజల పక్షానే రాజకీయాలు చేస్తారన్నారు. రాజకీయాలంటే ఏహ్యా భావం కలుగుతుందన్నారు. అందుకే కమ్యూనిస్టు పార్టీ దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని డిమాండ్‌ చేస్తున్నదన్నారు. ప్రజాప్రతినిధిగా కమ్యూనిస్టుపార్టీ శాసనసభ్యునిగా బాధ్యతయుతమైన వివక్షంగా పనిచేస్తామని, ప్రజల పక్షాన నిలబడతానని తెలిపారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఈ సందర్భంగా కూనంనేనిని పలువురు అభినందించారు. సీపీఐ సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, గ్రానైట్‌ అసోసియేషన్‌, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), టీడీపీ, వివిధ పార్టీల నేతలు, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు పూలమాలు, శాలువాలతో సన్మానించారు.
ఈ సభలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్‌, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పాన్నం వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కూరపాటి వెంకటేశ్వరరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాలీర్పాషా, పట్టణానికి చెందిన ప్రముఖులు డాక్టర్‌ సి. గోర్కీ, చెరుకూరి కృష్ణమూర్తి, చిన్నికృష్ణారావు, వేజర్లసురేష్‌, నవీన్‌, పోట్ల మాధవరావు, గరికపాటి వెంకట్రావు, ఉప్పుల వెంకటరమణ, డాక్టర్‌ యలమంచలి రవీంద్రనాద్‌, డాక్టర్‌ బాగం కిషన్‌రావు, డాక్టర్‌ జి.వెంకటేశ్వరరావు, డాక్టర్‌ సి.భారవి, ఎన్‌టీయూ నాయకులు సామినేని సురేష్‌, సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మెన్‌ మహ్మద్‌ మౌలానా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రాబాలు, ఎస్‌కె. జానిమియా, కొండవర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.