‘నా సామిరంగ’ ఉందంటే.. మూవీ రివ్యూ

          విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna) హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ’ సినిమా ఈ సంక్రాంతికి నేడు థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరుణ్(Raj Tarun) ముఖ్య పాత్రలు చేస్తుండగా.. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటించారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమా పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ప్రేక్షకుల అంచానాలను నిజం చేసింది. ఇది విజయవంతమైన మలయాళ చిత్రానికి రీమేక్‌. కానీ, ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా.. కథను పూర్తిగా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మలచడంలో అటు రచయిత ప్రసన్న కుమార్‌, ఇటు స్క్రీన్‌ప్లేలో దర్శకుడు విజయ్‌ బిన్నీ విజయం సాధించారు.

      కథ ఎలా ఉందంటే
కథ 1963లో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభం అవుతుంది. అంబాజీపేట గ్రామానికి చెందిన కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్‌) ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అంజి వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో.. కిష్టయ్యనే అన్ని తానై పెంచుతాడు. ఒక్కసారి సహాయం చేశాడని ఆ ఊరి పెద్దాయన(నాజర్‌)దగ్గరే పనిచేస్తుంటాడు. వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు(రావు రమేష్‌) కూతురు వరాలు(ఆషికా రంగనాథ్‌) అంటే కిష్టయ్యకు చిన్నప్పటి నుంచి ఇష్టం. వరాలుకు కూడా కిష్టయ్య అంటే ఇష్టమే కానీ.. పదేండ్ల కిందట జరిగిన ఓ సంఘటన కారణంగా పెండ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఈ మధ్యలో అంజికి అదే గ్రామానికి చెందిన అనాథ అమ్మాయి(మిర్నా మీనన్‌)తో పెండ్లి జరిగి, పాప కూడా పుడుతుంది.
ఇదిలా ఉంటే అంబాజీపేటకు చెందిన భాస్కర్‌(రాజ్‌ తరుణ్‌)..పక్క ఊరి ప్రెసిడెంట్‌ కూతురు(రుక్సార్‌)తో ప్రేమలో పడతాడు. పండగవేళ గోడ దూకి ప్రెసిడెంట్‌ గారి ఇంట్లోకి వెళ్లి దొరికిపోతాడు. ప్రెసిడెంట్‌ మనుషులు భాస్కర్‌ని చంపేందుకు ప్రయత్నించగా.. కిష్టయ్య కాపాడుతాడు. అంతేకాదు పెద్దాయన ఆజ్ఞ మేరకు పండగ జరిగేవరకు భాస్కర్‌కు ఎలాంటి హనీ కలగకుండా చూసుకుంటాడు.
కట్‌ చేస్తే..దుబాయ్‌ నుంచి తిరిగొచ్చిన పెద్దాయన చిన్న కుమారుడు దాసు(డాన్సింగ్‌ రోజ్‌) కిష్టయ్య, అంజిని చంపేందుకు కుట్రలు పన్నుతాడు. దాసుతో పక్క ఊరి ప్రెసిడెంట్‌ కూడా చేతులు కలుపుతాడు. అసలు దాసు అంజి, కిష్టయ్యను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పదేళ్లుగా వరాలు ఎందుకు ఒంటరిగా ఉంటుంది? పదేండ్ల క్రితం ఏం జరిగింది? పెద్దాయనకి ఇచ్చిన మాట ప్రకారం పక్క ఊరి ప్రెసిడెంట్‌ కూతురితో భాస్కర్‌ పెండ్లిని కిష్టయ్య జరిపించాడా లేదా? చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న కిష్టయ్య కోసం అంజి చేసిన త్యాగమేంటి? అన్నం పెట్టి చేరదీసిన పెద్దాయన కొడుకునే కిష్టయ్య ఎందుకు చంపాల్సి వచ్చింది? వరాలు, కిష్టయ్యల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


స్నేహం.. ప్రేమ.. విధేయత.. ప్రతీకారం వంటి అంశాలతో ముడిపడిన కథ ఇది. నిజానికి ఈ తరహా సినిమాలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి. కానీ, దీన్ని 1980ల నాటి కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ చేయడమే ఈ సినిమాకు  కొత్తదనం. అది ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతి పంచింది. మాస్‌ యాక్షన్‌ అంశాలు.. నాగార్జున సందడి.. అంజి, వరాలు పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ప్రధాన పాత్రల చిన్ననాటి ఎపిసోడ్‌తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. భాస్కర్‌ను కాపాడే క్రమంలో వచ్చే ఓ చక్కటి యాక్షన్‌ ఎపిసోడ్‌తో కింగ్ పరిచయ సన్నివేశం ఆకట్టుకుంటుంది. (Naa Saami Ranga Review) కిష్టయ్య – వరాలు ప్రేమకథను భాస్కర్‌కు అంజి చెప్పడంతో సినిమా రొమాంటిక్‌ టచ్‌తో మళ్లీ ఫ్లాష్‌ బ్యాక్‌లోకి టర్న్‌ తీసుకుంటుంది.
దాసు పాత్ర కథలోకి ప్రవేశించినప్పటి నుంచే ఘర్షణ మొదలవుతుంది. ఓ అదిరిపోయే యాక్షన్‌ ఎపిసోడ్‌తో ప్రథమార్ధానికి విరామమిచ్చిన తీరు బాగుంది. కిష్టయ్య – అంజిల హత్యకు దాసు ప్రణాళిక రచించడంతో ద్వితీయార్ధం ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇక్కడి నుంచి సినిమా పూర్తిగా యాక్షన్‌ కోణంలో పరుగులు తీస్తుందని అనిపించినా, కేవలం కిష్టయ్య పాత్రకు ఎలివేషన్‌లా చూపించారు. అంజిపై దాసు దాడి చేసే ఎపిసోడ్‌తోనే మళ్లీ కథలో పుంజుకుంటుంది. ఆ తర్వాత సినిమా ఒక్కసారిగా భావోద్వేగభరితంగా మారుతుంది. ఇక క్లైమాక్స్‌లో నాగ్‌ యాక్షన్‌ హంగామా ఆయన అభిమానులకు కనులవిందుగా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే:
కిష్టయ్య పాత్రలో నాగార్జున అదరగొట్టాడు. రొటీన్‌ కథే అయినా.. నాగార్జున ఎనర్జీటిక్‌ యాక్టింగ్‌తో బోర్‌ కొట్టకుండా కథనం సాగుతుంది. యాక్షన్‌ తో ఎమోషనల్‌ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. ఇక నాగార్జున తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర నరేశ్‌ది. అంజి పాత్రలో నరేశ్‌ పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ.. మరికొన్ని చోట్ల ఏడిపించాడు. తెరపై నాగార్జున, నరేశ్‌ల బ్రో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అషికా రంగనాథ్‌ గ్లామర్‌ సినిమాకు ప్లస్‌ అయింది. వరాలు పాత్రలో ఆమె ఒదిగిపోయింది. భాస్కర్‌గా రాజ్‌తరుణ్‌ ఉన్నంతలో చక్కగా నటించాడు. నాజర్‌, మిర్నా, రుక్సర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

అదనపు బలం:
కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలు ప్రాణం పోశాడు. పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.

చిత్రం: నా సామిరంగ, నటీనటులు: నాగార్జున, ఆషికా రంగనాథ్, అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్, మిర్నా మేనన్, రుక్సర్‌ థిల్లాన్, షబ్బీర్‌ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్‌ రావు, మహేశ్‌ తదితరులు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, మాటలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌ బిన్ని, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి.