నాడు అతి.. నేడు స్తుతి..

Nadu Ati.. Today Stuti..– వత్తాసు ఆఫీసర్లలో వణుకు
– మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో టెన్షన్‌
– ఇప్పటికే క్లాసులు పీకుతున్న మంత్రులు
– ఓవరాక్షన్‌ ఆఫీసర్లకు హెచ్చరికలు..
– మంత్రుల మెప్పు కోసం ఎడతెగని యత్నాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మళ్లీ బీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుంది.. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వారే ఉంటారనే భావనతో కొందరు అధికారులు అప్పట్లో ఓవరాక్షన్‌ చేశారు. కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో వత్తాసు ఆఫీసర్లలో వణుకు మొదలైంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడో తేదీన కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మొత్తం 11 మందికి మంత్రివర్గంలో చోటు లభించింది. వీరిలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌శాఖల మంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ, చేనేత, సహకారం, టెక్స్‌టైల్స్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఇ.. ఈ ముగ్గురు అమాత్యులు ఖమ్మం జిల్లాకు చెందినవారు కావడంతో నాడు అతిచేసిన అధికారుల్లో ఆందోళన మొదలైంది. తమపై చర్యలుంటాయేమోనని అణగిమణగి వ్యవహరిస్తున్నారు. కొత్త మంత్రుల దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. మెప్పు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాడు అతి చేసిన అధికారులే నేడు స్తుతి చేస్తున్న తీరును చూసి జనం విస్తుపోతున్నారు.
మంత్రి తుమ్మల సుతిమెత్తని హెచ్చరికలు..
”జిల్లా అధికారులు ఎంతో ఆప్యాయంగా.. అద్భుతంగా పనిచేసే రోజు వచ్చింది. గతంలో ఎవడన్న పనికిమాలినోడి ఒత్తిడి వల్ల మీరు కొన్ని తప్పులు చేసినా.. బాధపడొద్దు. ఆ పాపం వాళ్లది తప్ప మీది కాదని మాకు తెలుసు.. ఇప్పుడైనా సెట్‌రైట్‌ చేసుకోండి.. ఎక్కడైనా తప్పుడు కేసులు పెట్టినా.. ఎవడైనా కబ్జాలు చేసినా.. బెదిరించినా సీపీ, కలెక్టర్‌ అవన్నీ సెట్‌ చేసుకోండి. మీరు ఇక్కడే ఉండాలి.. ఇక్కడే ప్రజలకు సేవ చేయాలి.. మీరు ఎప్పుడూ తెలంగాణలోనే ఉంటారు. ఖమ్మంలో ఉంటారా?.. కరీంనగర్‌లో ఉంటారా? ఎక్కడున్నా ప్రజా సేవ చేయడమే మన భాగ్యం. కానీ గత ఐదేండ్లలో కొన్ని తప్పులు జరిగినవని.. ఎన్నికల ప్రచారంలో తెలిసింది. అవన్నీ మీ దృష్టికి తీసుకు రమ్మని చెబుతాను. తప్పుడు కేసులున్నా.. కబ్జాలున్నా సెట్‌రైట్‌ చేసే బాధ్యత మీ ఇద్దరిపైనే ఉంది.” అని మొన్న ఆదివారం పాతబస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుతిమెత్తగా అధికారులను హెచ్చరించారు.
నాటి తప్పిదాలతో నేడు ఆందోళన..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా దురుసుగా వ్యవహరించిన ఆఫీసర్లలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా 2018 ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికై…ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు కొందరు అధికారులు కొమ్ముకాశారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి నెగ్గి నాటి ప్రభుత్వంలో రవాణాశాఖమంత్రిగా ఉన్న పువ్వాడ అజరుకుమార్‌ కనుసన్నల్లోనే కొందరు అధికారులు నడుచుకున్నారు. స్వపక్షమైనా.. విపక్షమైనా.. ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా కొందర్ని తీవ్రంగా వేధించారనే ఆరోపణలున్న అధికారుల్లో ఇప్పుడు టెన్షన్‌ మొదలైంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం వంటి జనరల్‌ నియోజకవర్గాలతో పాటు సత్తుపల్లి, పినపాక తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఆఫీసర్లను తమ ఇష్టానుసారం వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల సమయంలోనూ కొందరు అధికారులు ‘కారు’పై మమకారం.. కాంగ్రెస్‌పై చీత్కారం ప్రదర్శించారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌లోనే ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులను ఇబ్బంది పెడుతున్న తీరును అప్పటి సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌, ఆ తర్వాత విష్ణు ఎస్‌ వారియర్‌ దృష్టికి రెండు, మూడు పర్యాయాలు తీసుకెళ్లారు. కానీ సంబంధిత అధికారులు పెడచెవిన పెట్టారు. తన మనుషులను వేధిస్తున్నట్టు నాడు బీఆర్‌ఎస్‌లోనే ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా తన అనుచరులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం టూ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఆ కేసు ఏమైందో కూడా ఇప్పటి వరకూ తెలియదు. ఇలాంటి అనేక ఘటనలు నాటి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయి. వీటిపై ఇప్పుడు ఎలాంటి చర్యలుంటాయోనని సంబంధిత అధికారుల్లో ఆందోళన నెలకొంది.
నాడు లోపాలు ఎత్తిచూపినా కేసులే..
నాటి ప్రభుత్వ హయాంలో ఖమ్మంలో వివిధ నిర్మాణాలు చేపట్టారు. రూ.24 కోట్లతో నూతనంగా నిర్మించిన బస్టాండ్‌, రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన కార్పొరేషన్‌ భవనం, డబుల్‌బెడ్‌రూమ్‌లు కొద్దిపాటి వర్షానికే కురుస్తుండటాన్ని సీపీఐ(ఎం) నేతలు వై.విక్రమ్‌, వెంకన్న వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దాంతో వారిపై కేసులు నమోదయ్యాయి. లోకాయుక్తలో ఈ కేసు నడుస్తోంది. అలాగే కాంగ్రెస్‌ నేతలు ముస్తఫా, మిక్కిలినేని నరేంద్ర, ఆర్టీఐ యాక్టివిస్టు కోయిని వెంకన్నలపై పీడీ యాక్టులు నమోదు చేసి నెలల తరబడి జైళ్లలో ఉంచారు. చివరికి వివిధ యూట్యూబ్‌ చానల్స్‌కు నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్‌లు ఇచ్చిన ఆటోడ్రైవర్లు, తదితరులపైనా దాడులు చేయడమే కాకుండా.. తిరిగి వారిపైనే కేసులు పెట్టిన ఉదంతాలు ఉన్నాయి. దీనికి బాధ్యులైన అధికారులు తమపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
రెవెన్యూ, పోలీస్‌ అధికారుల్లోనూ టెన్షన్‌..
అక్రమ రిజిస్ట్రేషన్‌లు, కబ్జాలకు వత్తాసు పలికిన రెవెన్యూ అధికారులు కొందరు ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ వివిధ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. రూ.కోట్ల అక్రమార్జనకు పాల్పడిన ఆ తహసీల్దార్లలో ఇప్పుడు టెన్షన్‌ నెలకొంది. ఎన్నికల సమయంలోనూ సంబంధిత ఆఫీసర్లు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. పాలేరు నియోజకవర్గంలోని రూరల్‌ పోలీసు ఉన్నతాధికారి, నేలకొండపల్లి, కూసుమంచి పోలీసు అధికారులు ఎన్నికల సమయంలో విపక్షాలతో వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఆన్‌లైన్‌ ప్రక్రియ విషయంలో బీఆర్‌ఎస్‌ మినహా మిగిలిన పార్టీలను ఇబ్బందిపెట్టారనే ఆరోపణలున్నాయి. నేలకొండపల్లిలో సీజ్‌ చేసిన కాంగ్రెస్‌ నేత ప్రచార వాహనాన్ని రోజుల తరబడి ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ అధికారులు నూతన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర మోకరిల్లుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పోలీసు, రెవెన్యూ అధికారులను పిలిపించి మంత్రి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇలా అప్పట్లో తప్పులు చేసిన అధికారులు ఇప్పుడు తీరని మనోవేదన చెందుతున్నారు.