హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకష్ణ రెడ్డి నిర్మించారు.
దర్శక ద్వయం సుజీత్, సందీప్ రూపొందించిన ఈ సినిమా నేడు (గురువారం) రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగులో నిర్మాత వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేస్తున్నారు. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ప్రొడ్యూసర్ చింతా గోపాలకష్ణ రెడ్డి మాట్లాడుతూ, ‘మా సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. ఓ మంచి సినిమా చేశామని సంతోషంగా ఉంది. దీపావళికి సకుటుంబంగా మా సినిమాని చూసి ఆనందించండి’ అని తెలిపారు. ‘ఈ సినిమా బ్యాడ్ మూవీ అని మీలో ఎవరైనా అంటే నేను సినిమాలు చేయడం మానేస్తా. ఎవరెవరికి ఎంత నచ్చుతుందో తెలియదు గానీ మంచి ప్రయత్నం అని మాత్రం అంటారు. నేను ప్రామీస్ చేస్తున్నా. థియేటర్స్‌కు వెళ్లండి. ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ,’కిరణ్ అబ్బవరం జర్నీకి నేను నెంబర్ వన్ ఫ్యాన్‌ని. కిరణ్ సక్సెస్ స్టోరీ నాకే కాదు ఇండిస్టీకి వచ్చే ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి హీరోలు సక్సెస్ కావాలి. జయాపజయాలు ఎవరికైనా సహజమే. కిరణ్ ధైర్యంగా ముందుకి వెళ్ళు. ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.