– ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ: ప్రపంచ టెన్నిస్‌లో భారత వర్థమాన క్రీడాకారుడు సుమిత్ నగాల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్నాడు. తాజాగా విడుదల చేసిన ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సుమిత్ నగాల్ ఐదు స్థానాలు ఎగబాకాడు. 68వ ర్యాంక్‌తో కెరీర్ అత్యుత్తమ స్థానం సాధించాడు. టెన్నిస్ ఓపెన్ శకంలో ర్యాంకింగ్స్ 1973లో ఆరంభించగా.. అప్పటి నుంచి భారత్ నుంచి ఉత్తమ ర్యాంక్ సాధించిన జాబితాలో శశి మీనన్ (71)ను సుమిత్ నగాల్ అధిగమించాడు. ఈ ఏడాది రెండు ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో పోటీపడిన సుమిత్ నగాల్.. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సహా గత ఐదేండ్లలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఈవెంట్‌లో పోటీపడిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. విజయ్ అమృత్‌రాజ్ (18), రమేశ్ కృష్ణన్ (23), సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (62) మాత్రమే సుమిత్ నగాల్ కంటే ముందున్నారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌కు ఎంపికైన సుమిత్ నగాల్.. విశ్వక్రీడల్లో మరోసారి టైటిల్ వేట సాగించనున్నాడు. లియాండర్ పేస్ తర్వాత వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్‌లో పోటీపడుతున్న తొలి ఆటగాడిగా సుమిత్ నగాల్ నిలిచాడు. ఈ ఏడాది హీల్‌బ్రాన్ చాలెంజర్, చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ ట్రోఫీలను సుమిత్ నగాల్ గెల్చుకున్న సంగతి తెలిసిందే.