పోరాడి ఓడిన నాగల్‌

– రెండో రౌండ్లో సుమిత్‌ ఓటమి
– మోంటే కార్లో మాస్టర్స్‌ 20224
మోంటే కార్లో (మొనాకో): భారత వర్థమాన టెన్నిస్‌ క్రీడాకారుడు సుమిత్‌ నాగల్‌ మోంటే కార్లో మాస్టర్స్‌ 2024 టోర్నమెంట్‌లో పోరాడి ఓడాడు. ఏటీపీ 1000 టోర్నీ ప్రధాన డ్రాకు చేరుకోవటంతోనే రికార్డులు పరంపర మొదలుపెట్టిన నాగల్‌ తొలి రౌండ్లో అసమాన విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో సుమిత్‌ నాగల్‌ పోరాడి ఓడాడు. మూడు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 3-6, 6-3, 2-6తో సుమిత్‌ నాగల్‌ పరాజయం పాలయ్యాడు. వరల్డ్‌ నం.7, డెన్మార్క్‌ ఆటగాడు హౌల్డర్‌ రూనెపై నాగల్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తొలి, చివరి సెట్‌లో వెనుకంజ వేసినా రెండో సెట్‌లో చెప్పుకోదగిన విజయం సాధించాడు. రెండు గంటల 11 నిమిషాల మ్యాచ్‌లో సుమిత్‌ నాగల్‌ మూడు బ్రేక్‌ పాయింట్లతో మెరువగా.. డెన్మార్‌ ఆటగాడు రూనె ఐదు బ్రేక్‌ పాయింట్లతో పైచేయి సాధించాడు. పాయింట్ల పరంగా నాగల్‌ 70-88తో గట్టి పోటీ ఇచ్చాడు. రూనె 15 గేములు గెల్చుకోగా.. సుమిత్‌ నాగల్‌ 11 గేమ్‌లతో మెప్పించాడు. మోంటో కార్లో మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ఓ భారత ఆటగాడికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావటం గమనార్హం.