యూసీసీకి వ్యతిరేకంగా తీర్మానించనున్న నాగాలాండ్‌

Against UCC Nagaland to be resolvedకోహిమా : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని నాగాలాండ్‌లోని అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. దీనిపై శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించాయి. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన కుజోలిజో నైనూ శాసనసభలో సోమవారం దీనిపై చర్చను ప్రారంభించారు. భిన్న సంప్రదాయాలు, సంస్కృతులకు నెలవైన భారతదేశంలో ఇలాంటి చట్టాన్ని తీసుకురావడం నిష్ప్రయోజనమని, పైగా అది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. ఒకవేళ పార్లమెంటు యూసీసీని ఆమోదిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 (ఏ) కింద నాగాలాండ్‌కు మినహాయింపు లభిస్తుందని ఆయన గుర్తు చేశారు. నాగాల మత, సామాజిక పద్ధతులకు సంబంధించిన వ్యవహారాలకు పార్లమెంట్‌ చట్టాలు వర్తించబోవని స్పష్టం చేశారు. బెంగాల్‌ ఈస్ట్రన్‌ ఫ్రాంటియర్‌ రెగ్యులేషన్‌ చట్టం మేరకు యూసీసీ నుండి నాగాలాండ్‌ను మినహాయించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి నైఫియూ రియో చెప్పారు. ఈ చట్టం ప్రకారం నాగాలాండ్‌కు న్యాయ, కార్యనిర్వాహక, పరిపాలనా సంబంధమైన అధికారాలు సంక్రమించాయని, భూ సంబంధమైన విషయాలలో స్వయం నిర్ణయధికారం కూడా ఉన్నదని వివరించారు.