
చిన్నపిల్లలు,మహిళలు రోజువారీ ఆహారంలో తగినంత పీచు పదార్థం,ప్రోటీన్స్,పిండి పదార్థం,మాంసకృత్తులు ఉంటేనే ఆరోగ్యకరం గా జీవించ వచ్చని స్థానిక కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ నాగాంజలి అన్నారు. వ్యవసాయ కళాశాల ఆద్వర్యంలో చివరి సంవత్సరం విద్యార్ధులు చే మండలంలోని నారాయణపురం లో నిర్వహించే జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాలు ఆదివారంతో ఆరో రోజుకి చేరాయి. ఈ సందర్భంగా పోషకాహారం పై అవగాహన,వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై వర్క్ షాప్ నిర్వహించారు. విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనత అనేది ప్రధాన సమస్యగా ఉందని,దాని నివారణకు మహిళలు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు.అంగన్వాడీ అధికారిని శ్రీమతి లక్ష్మీ మాట్లాడుతూ చిన్నపిల్లలు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఎదగటానికి పాలు,పెరుగు, గుడ్లు మరియు పండ్లు ఎంతగానో దోహదపడతాయని,ఇవి తమ రోజువారి ఆహారంలో ఉండేలా తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలని అన్నారు.
అనంతరం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు – వాటి నిర్వహణపై జరిగిన వర్క్ షాప్ లో శాస్త్రవేత్త డాక్టర్ ఎం. రాంప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులు వ్యవసాయ వ్యాపారవేత్తలు గా ఎదిగి,యువతకి ఉపాధి కల్పించడంతోపాటు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి అన్నారు. అనంతరం కృషి నేత్ర వ్యవసాయ e – మ్యాగ్జైన్ సంపాదకులు శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని తాము ఎదగటం తో పాటు,దేశ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. అనంతరం శాస్త్రవేత్త డాక్టర్ పి. రెడ్డి ప్రియ మాట్లాడుతూ జీవన ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు మరియు దాని నిర్వహణ గురించి వివరించారు.శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం గ్రామ రైతులతో పాటు వ్యవసాయ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.