నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ ని సస్పెండ్ చెయ్యాలి…

– ఎంఅర్పిఎస్, ఎంఎస్ఎఫ్ యూనివర్సిటీ కమిటీ
నవతెలంగాణ – డిచ్ పల్లి
జనవరి 6న జరుగనున్న మాదిగ విద్యార్థుల ( ఎంఎస్ఎఫ్ ) జాతీయ మహాసభకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి నిరాకరించినందుకు నిరసనగా యూనివర్సిటీ కమిటీ అధ్వర్యంలో యూనివర్సిటీలో యూనివర్సిటీ అధ్యక్షులు దినేష్ మాదిగ  అధ్యక్షతన మహా ధర్నా నిర్వహించారు. ఈ మహా ధర్నాకు ఎంఅర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంఛార్జి శనిగరం మురళి కృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విసి రాజశేఖర్  వైఎస్సార్సీపీ నాయకులుగా వ్యవహరించడం తగదన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలకు, అధికార ప్రతిపక్ష అనుంబంద విద్యార్థి సంఘాలకు సమావేశాలు పెట్టుకోడానికి అనుమతి ఇచ్చి మాదిగ విద్యార్థుల సమావేశానికి అనుమతి నిరాకరించడం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విసి  బానిసత్వం చెయ్యడమే అవుతుందని విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు 45 లక్షల పైన ఉంటారని, వాళ్ళు కన్నెర్ర చేస్తే జగన్ రెడ్డి రాజకీయ సమాధి చేస్తారని హెచ్చరించారు.గతంలో ఇలానే చంద్రబాబు కూడా మాదిగల మీద అణచివేత ప్రదర్శిస్తే రాజకీయంగా 23 సీట్లకు పరిమితం అయ్యాడని,ఈ దేశంలో ఉండే ఏ యూనివర్సిటీ అయిన ప్రజాస్వామికంగా సమావేశం పెట్టుకుంటాం అంటే అనుమతి ఇస్తారు కానీ ఒక ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాత్రం అనుమతి నిరాకరించడం అంటే ఆ రాష్ట్రంలో మాదిగల మీద ఎంత అణచివేత ఉందో ఒకసారి సమాజం గుర్తించాలని సూచించారు. ఎంఅర్పిఎస్ నాయకత్వాన్ని నిన్నటి నుంచి అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని వారిని బేషరతుగా విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.మాదిగ విద్యార్థి సమాఖ్య ( ఎంఎస్ఎఫ్ ) జాతీయ మహాసభకు అనుమతి నిరాకరించి, మాదిగల పట్ల కక్షపూర్తికంగా వ్యవహరిస్తున్న  వైస్ చాన్సలర్ పి. రాజశేఖర్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో  జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, నాయకులు రమణ, సైమన్ పాల్  తదితరులు పాల్గొన్నారు.