నాగార్జునకి శివ..చైతూకి కస్టడీ..

            ఈ సినిమా అవుట్‌ఫుట్‌ చూసిన తర్వాత చైతన్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌ ఫిల్మ్‌ అవుతుందనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే నాగార్జున కెరీర్‌లో ‘శివ’ ఎలా గుర్తుండి పోయిందో, నాగచైతన్య కెరీర్‌లో ఈ సినిమా అలా గుర్తుండిపోతుంది. ‘శివ’ సినిమానే కాదు అందులో పాత్రలు ఎలా గుర్తుండి పోయాయో.. ఇందులో అరవింద్‌ స్వామి, శరత్‌ కుమార్‌, ప్రియ మణి.. పాత్రలు అలా గుర్తుండి పోతాయి. ప్రతి పాత్ర యూనిక్‌గా ఉంటుంది.
నాగ చైతన్య, వెంకట్‌ప్రభు కాంబోలో రూపొందిన తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్‌ ‘కస్టడీ’. కతి శెట్టి కథానాయికగా శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మించారు. పవన్‌కుమార్‌ సమర్పిస్తున్న ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి మీడియాతో ఈ చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘ఒక నిర్మాతగా కథ, మంచి స్క్రీన్‌ప్లే నన్ను ఎంతో ఇంప్రెస్‌ చేశాయి. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్‌, ఎంటర్టైన్మెంట్‌తో సీరియస్‌ కథ జరుగుతుంటుంది.
సీరియస్‌లో కూడా వినోదం ఉంటుంది. ఈ రెండింటిని దర్శకుడు మిక్స్‌ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. తెలుగు ఎమోషన్స్‌తో ఒక హాలీవుడ్‌ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. పోలీస్‌ కథ అంటే యూనివర్సల్‌ అప్పీల్‌ ఉంటుంది. అయితే మొదట్నుంచీ దీన్ని బైలింగ్వెల్‌ చిత్రం అనుకున్నాం. బైలింగ్వెల్‌కి కూడా తెలుగుకి ప్రత్యేకమైన షాట్‌, తమిళ్‌కి ప్రత్యేకమైన షాట్‌ తీశాం. రెండు సినిమాలు తీసినట్లే (నవ్వుతూ). హిందీలో తర్వాత ఉంటుంది. అలాగే తెలుగులో వెన్నెల కిషోర్‌ చేసిన పాత్రని, తమిళ్‌లో ప్రేమ్‌ జీ చేశారు. ఈ ఒక్క పాత్రలో మాత్రమే మార్పు ఉంటుంది. మిగిలినవి ఒకేలా ఉంటాయి. ఇదొక నిజాయితీ గల కానిస్టేబుల్‌ కథ. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్‌ కథ. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉంటాయి. పైగా ఇది 90లో జరిగే కథ. ఇలాంటి సినిమాకి నేపథ్య సంగీతం ఇళయరాజా చేస్తే బావుంటుందని అనుకున్నాం. అయితే కథ వినగానే ఇళయరాజా, ఆయన తనయుడు యువన్‌ మేం చేస్తామని ముందుకు రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో సాధారణ కానిస్టేబుల్‌గా చైతూ అద్భుతంగా నటించారు. మా దర్శకుడు చెప్పినట్టు ఈ సినిమాలో కొత్త చైతూని చూస్తారు. అలాగే నాయిక కృతిశెట్టి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆమె పాత్ర అందర్నీ కచ్చితంగా అలరిస్తుంది. అరవింద్‌ స్వామి కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఈ పాత్ర చేస్తానని చెప్పారు. థియేటర్‌లో ఆయన పాత్రని ప్రేక్షకులు చాలా ఎంజారు చేస్తారు. టెర్రిఫిక్‌గా అదే సమయంలో చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుందీ ఆయన పాత్ర. శరత్‌ కుమార్‌ పాత్ర కూడా చాలాపవర్‌ ఫుల్‌గా ఉంటుంది.
రెండు కొండల మధ్య చిట్టెలుక ఉంటే ఎలా ఉంటుందో అరవింద్‌ స్వామి, శరత్‌ కుమార్‌ మధ్య నాగచైతన్య పాత్ర అలా కనిపిస్తుంది. ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా కోసం అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేశాం. తెలుగు స్క్రీన్‌ మీద ఇలాంటి అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చూసి ఉండరు. దీంతోపాటు ఇందులో ఉన్న నాలుగు యాక్షన్‌ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉంటాయి. ఈ సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతోనే దీనికి సీక్వెల్‌గా ‘కస్టడీ 2’ చేయాలనుకుంటున్నాం. తెలుగులో నాగచైతన్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌ థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. తమిళనాడులో 200 థియేటర్స్‌ పైగా విడుదల చేస్తున్నాం. రామ్‌, బోయపాటి సినిమా షూటింగ్‌ కంటిన్యూగా జరుగుతోంది. రామ్‌ బర్త్‌డేకి టీజర్‌ రిలీజ్‌ చేస్తాం. నాగార్జున సినిమా జూన్‌ నుంచి షూటింగ్‌ ఉంటుంది. అలాగే చైతో మరో సినిమా చేయబోతున్నాం.