నయీ దిశా హెల్ప్‌ లైన్‌ ఆటిజం పిల్లలకు, పేరెంట్స్‌కి వరం

– హెల్ప్‌లైన్‌ ఆవిష్కరణలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆటిజయం, మేధో వైకల్యం, ఎదుగుదల లోపం ఉన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు నయీ దిశా హెల్ప్‌లైన్‌ ఒక వరం లాంటిదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నయీ దిశా హెల్ప్‌లైన్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యాంగం దివ్యాంగులకు, వారి కుటుంబాలకు కూడా హక్కులు కల్పించిందన్నారు. ఆ హక్కుల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆటిజం కుటుంబ సమస్య కాదనీ, అది సమాజ, ప్రభుత్వ సమస్య అని చెప్పారు. ఆటిజం సమస్యలకు పరిష్కారం చూపాలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తమ ప్రభుత్వం దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. వైకల్యం ఉంటే ఎవ్వరూ ఆత్మనూన్యతకు గురికావొద్దని సూచించారు. నయీ దిశా హెల్ప్‌ లైన్‌ను రూపొందించిన నయీ దిశా రిసోర్స్‌ సెంటర్‌ నిర్వాహకులను అభినందించారు.