నాలుగు నెలల్లో అందుబాటులోకి నైనీ బొగ్గు

Navatelangana,Adilabad,Telugu News,Telangana,– ప్రభుత్వ ప్రతిష్టతను పెంపొందించే విధంగా మైనింగ్‌ చేపట్టాలి
– నిర్వాసిత గ్రామాలకు మెరుగైన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలి
– ఎనర్జీ సెక్రటరీ, సింగరేణీ సీఎండీ, స్పెషల్‌ సెక్రటరీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-జైపూర్‌
135 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ మొదటిసారి తెలంగాణ నుండి ఒడిశాలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించబోతోంది. మరో నాల్గు నెలల్లో ఒడిశా నైనీ బొగ్గు బ్లాకు నుండి ఉత్పత్తి ప్రారంభించడానికి సింగరేణి యాజమాన్యం సమాయత్తమైంది. ఇటీవల ఒడిశాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అక్కడి ముఖ్యమంత్రిని కలిసి కీలక అంశాలపై చర్చించి నైనీ బొగ్గు తవ్వకాలకు ప్రభుత్వ పరంగా సహకరించాలని కోరారు.. ఈ క్రమంలో మంగళవారం సచివాలయంలో ఇందన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, సింగరేణి సీఎండీ బలరామ్‌, స్పెషల్‌ సెక్రటరీ కృష్ణభాస్కర్‌, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్‌రెడ్డి, జీఎం కోఆర్డినేషన్‌ దేవేందర్‌ ఇతర అధికారులతో సుధీర్ఘంగా సమీక్షించారు. సింగరేణి సంస్థకు ఒడిశాలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి మిగిలిన పనులు వేగవంతంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే విధంగా పని చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలిసారి తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు అని గుర్తు చేస్తూ ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి ప్రభుత్వ ప్రతిష్టను పెంచేవిధంగా మైనింగ్‌ చేట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. నైనీ బొగ్గు బ్లాకుకు ఇప్పటి వరకు అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు, తదుపరి ఆ స్థలం అప్పగింతపై ఒడిశా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందున ఆ రాష్ట్ర అటవీశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనుల పూర్తికి చొరవ చూపాలని సూచించారు. ఇందుకోసం నైనీ జనరల్‌ మేనేజర్‌కు బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. అక్కడి ఏకైక నిర్వాసిత గ్రామ ప్రజలతో స్థానిక చెండిపడ ఎమ్మెల్యే అగస్తి బెహరా, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించిన విధంగా స్థానికులకు పునరావాస పథకం, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలపై తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా అక్కడి ముఖ్యమంత్రి అంగీకరించిన విధంగా జరపడా నుండి చెండిపడ వరకు గల ప్రస్తుత రోడ్డును విస్తరించడం, బలోపేతం చేయడం లాంటి పనులు ఆ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ సమన్వయం చేస్తూ పూర్తి చేయాలని సూచించారు. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ను వెంటనే నిర్మించడం, పునరావాస, నష్టపరిహారం అంశాలపై అధికారులతో సమావేశమై పూర్తి చేయాలని పేర్కొన్నారు.