కాంగ్రెస్ చేతికి నల్గొండ డీసీసీబీ..

– నెగ్గిన అవిశ్వాసం
– నూతన చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి !
– మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసిన 15 మంది డైరెక్టర్లు
– సోమవారం చైర్మన్ ఎన్నిక !
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మనం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై 14 మంది డైరెక్టర్లు ఈనెల 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని డిసిఓ కార్యాలయంలో డిసిఓ కిరణ్ కుమార్ కు అవిశ్వాస తీర్మానం కోరుతూ  లేఖ అందజేశారు. డిసిఓ గతంలో తెలిపిన తేదీ ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటలకు నల్లగొండ డీసీసీబీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 15 మంది డైరెక్టర్లు మహేందర్ హేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మహేందర్ రెడ్డి తన చైర్మన్ పదవిని కోల్పోయారు.  నూతనంగా చైర్మన్ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంభం శ్రీనివాస్ రెడ్డి చేపట్టే అవకాశం ఉంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. కాగా ప్రస్తుతం వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న దయాకర్ రెడ్డి ఇంచార్జ్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు.
ఎలాంటి రాజకీయ కోణం లేదు..
అవిశ్వాసం నెగ్గిన  అనంతరం డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నల్లగొండ డీసీసీబీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా బ్యాంకును ముందుకు తీసుకుపోతామని అన్నారు. బ్యాంకును దినదిన అభివృద్ధి చేస్తూ రైతులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనో .. బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉందనో  అవిశ్వాసం పెట్టలేదు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు. కేవలం మహేందర్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా 19 మంది డైరెక్టర్లకు గాను 15 మంది అవిశ్వాసంలో పాల్గొన్నారు. అవిశ్వాసం పై ఈనెల 10న డిసిఒకు తీర్మానం ఇచ్చాం. ఈ 18 రోజులుగా మహేందర్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా డైరెక్టర్లు నాకు మద్దతుగా నిలిచారు. వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. గత పాలకులు డిసిసిబికి రాజకీయ రంగు పులిమి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. తాము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు,ఉద్యోగుల సలహాలు సూచనలతో  అన్ని విధాలుగా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. ఎన్ని ఇబ్బందుల గురిచేసిన డైరెక్టర్లంతా అవిశ్వాసానికి హాజరయ్యారని తెలిపారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తాము అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకున్నామని స్పష్టం చేశారు. అవిశ్వాసానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, డైరెక్టర్లంతా సహకరించారని, ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, డిసిసిబి డైరెక్టర్లు ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి, పాశం సంపత్ రెడ్డి, అంజయ్య, గుడిపాటి సైదులు, వీరస్వామి, కొండా సైదులు, కోడి సుష్మ, కరుణ, అనురాధ, అందేల లింగయ్య యాదవ్, రామచంద్రయ్య, జూలూరు శ్రీనివాస్, జయరాం నాయక్, బంటు శ్రీను,పలువురు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యుఐ కార్యకర్తలు పాల్గొన్నారు.