నల్లగొండ పోరాటాల ఖిల్లా

– ప్రజలు,ఈ ప్రాంత కమ్యూనిస్టులు ఉద్యమ చైతన్యులు
– ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ- సంస్థాన్‌ నారాయణపురం
నల్లగొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. నల్లగొండ ప్రాంతాన్ని కమ్యూనిస్టులు ఉద్యమాల ద్వారా ప్రభావితం చేశారన్నారు.కమ్యూనిస్టుల ఉద్యమ చైతన్యం వథా కావద్దన్నారు.ఈ ప్రాంత కమ్యూనిస్టులకు నీతి నిజాయితీ గల చరిత్ర ఉందన్నారు.ప్రజా ఉద్యమ చైతన్యంతో ధన ప్రవాహాన్ని ఓడించాలన్నారు. ధన మదంతో కొంతమంది బెహర్‌ గాళ్లు పార్టీలు మారుస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మునుగోడు ప్రజలను మోసగించలేరు అన్నారు. మునుగోడు ప్రజలు ఎంతో చైతన్యవంతులన్నారు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకున్న మోసగాళ్లకు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారన్నారు. ఓట్లు తలరాతలనే మారుస్తాయన్నారు. అదే చైతన్యంతో బీఆర్‌ఎస్‌ గెలిపించాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సబండ వర్గాల ప్రజలను గౌరవించుకుంటున్నామన్నారు. ఫ్లోరైడ్‌ తో బాధపడుతున్న మునుగోడు ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విముక్తి కల్పించామన్నారు. సాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకమును పూర్తి చేసే బాధ్యత నాదే అన్నారు.ఏడాదిన్నరలో పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గం లో 2లక్షల ఎకరాలకు సాగునీరు సౌకర్యం కల్పిస్తానన్నారు. ఇప్పటికే తాగునీటి కోసం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేశామన్నారు. పొరపాటున కాంగ్రెస్‌ ఓటేస్తే వెనుకటి రోజులు వస్తాయన్నారు.60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో రైతులు అరిగోస తీశారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కావడం లేవన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు రోడ్లెక్కే పరిస్థితి దాపురించిందన్నారు. టిఆర్‌ఎస్‌ చేపట్టిన 24 గంటల ఉచిత విద్యుత్తు రైతుబంధు రైతు బీమా వంటి పథకాలు దేశానికే తలమానికంగా నిలిచాయన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌,మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, భువనగిరి జిల్లా పరిషత్‌ చైర్మెన్‌్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి, గీత కార్పొరేషన్‌ చైర్మెన్‌్‌ పల్లె రవికుమార్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లా మార్కండేయులు వేమిరెడ్డి నరసింహారెడ్డి,మునగాల నారాయణరావు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు ఎంపీపీలు సింగిల్‌ విండో చైర్మన్లు పాల్గొన్నారు.