– ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ
– 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. గత నెలలో షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయగానే ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 9 వరకు సెలవు దినాలు మినహా, మిగతా అన్ని పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 13 వరకు అవకాశం ఉంది. 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 12 జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ నియోజక వర్గంలో పోటీ చేసే అభ్యర్థులెవరైనా నల్లగొండ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
4,61,806 మంది ఓటర్లు
ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఇక్కడినుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను ప్రకటించింది. బీఆర్‌ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాగా ప్రధాన పార్టీలతో పాటు ఈ సారి పలువురు ఇండి పెండెంట్లుగా బరిలో ఉంటారని భావిస్తున్నారు.