39వ రక్తదానంతో పలువురికి ఆదర్శంగా నల్ల గణేష్..

Nalla Ganesh is an ideal for many people with the 39th blood donation.నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల కేంద్రానికి చెందిన నల్ల గణేష్ గుప్తా ఆపదలో అవసరమైన వారికి రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు గణేష్ గుప్తా 39 సార్లు రక్తదానం చేసి ఎందరికో ప్రాణదానం చేశారు. రక్తదానం చేయడం నిర్జీవం అవుతున్న తరుణంలో ఏకదాటిగా రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్న అభాగ్యులకు ప్రాణదాతగా నిలుస్తున్న గణేష్ గుప్తాను పలువురు అభినందిస్తున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో O+ (ఓ పాజిటివ్) రక్తం అవసరం అవడంతో ఆస్పత్రి సిబ్బంది సూచనల మేరకు గర్భిణీ కుటుంబ సభ్యులు గణేష్ గుప్తాను  ఫోన్ ద్వారా సంప్రదించారు. వెంటనే గణేష్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్తాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ గుప్తా మాట్లాడుతూ ఎన్నిసార్లు మనం రక్తదానం చేసిన మన శరీరానికి ఎలాంటి హాని జరగదన్నారు. రక్తదానం చేయడం ద్వారా  ఇంకా ఆరోగ్యంగా ఉంటామని స్పష్టం చేశారు. మనం చేసిన రక్తదానం ఆపదలో ఉన్న వారికి  ఉపయోగపడుతుందని, మన ఆరోగ్యం కూడా బాగుంటుందని, వీలైనంత వరకు అందరూ రక్తదానం చేయాలని కోరారు. తాను ప్రచారం కోసం ఎన్నిసార్లు రక్తదానం చేసినట్లు చెప్పుకోవడం లేదని,ఇలా రక్తదానం చేయడం చూసి కొందరైన  ఆదర్శంగా తీసుకుంటారనే ఆశతో చెబుతున్నానే కానీ నా గొప్ప కోసం కాదన్నారు.