ఇరవయ్యో శతాబ్దపు ప్రపంచ యవనికపై ఇంఎంఎస్ నంబూద్రిపాద్‌ది విలక్షణ స్థానం. ప్రజా ఉద్యమాలలో అగ్రభాగాన నిలుస్తూ మరోవైపు ఎన్నికల్లో ఘన విజయాలు సాధించి భారత రాజకీయాలలో కీలకమైన మలుపునకు కారణమైన యోధుడాయన. ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి పీఠమెక్కిన తొలి కమ్యూనిస్టుగా ఆయనను ప్రపంచం గుర్తుంచుకుంది. కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి గండికొట్టిన తొలి ముఖ్యమంత్రిగా చరితార్థుడైన ఉద్దండుడు. సిద్ధాంతకర్తగా, పాలనావేత్తగా బహుముఖ ప్రజ్ఞచాటి. కమ్యూనిస్టు ఉద్యమానికి వూపిరులూదిన అతిరథ మహారథుడు. ఎలంకులం మనక్కర్ శంకర నంబూద్రిపాద్ దేశంలో అరవయ్యేళ్లపాటు కమ్యూనిస్టు ఉద్యమానికి జీవనాడిగా నిలిచిన పేరది. సనాతన ఆచారవ్యవహరాలకు కట్టుబడిన సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఇంఎంఎస్ అలుపులేని సేవానిరతితో కేరళ ప్రజలకు ప్రియతమ నాయకుడైనాడు. ఇప్పటికీ కేరళలో అరుణపతాకం రెపరెపలాడుతుందంటే అందుకు ఆయన వేసిన పునాదులు, ఇచ్చిన వారసత్వం కీలకపాత్ర వహిస్తాయి. 1909 జూన్ 14న దక్షిణమలబార్ ప్రాంతంలోని ఎలంకులం గ్రామంలో ఆయన జన్మించారు. వేదవిద్యలను నిష్టగా అభ్యసించిన బాల్యం తనది. సోదరుడితో పాటు 1925లో పాఠశాలకు వెళ్లడం మొదలెట్టాకే ఆనకు సమాజ స్థితిగతులపై అవగాహన కలిగింది. క్రమంగా సంఘసంస్కరణ స్వాతంత్రోద్యమాల పట్ట ఆకర్షితులైనారు. 1932లో కళాశాల విద్యకు మధ్యలోనే స్వస్తి చెప్పి జాతీయోద్యమబాట పట్టారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. అక్కడే ఆయనకు కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపకుడైన కృష్ణపిళ్లెతో పరిచయమేర్పడింది. బెంగాల్ విప్లవకారుల సాన్నిహిత్యమూ కలిగింది. కాంగ్రెస్‌లో అంతర్భాగంగా 1934లో కాంగ్రెస్ సోషలిష్టుపార్టీ ఆవిర్భవించినప్పుడు నంబూద్రిపాద్ దానికి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైనారు. మద్రాసులో కృష్ణపిళ్లె సుందరయ్యలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన కమ్యూనిస్టు ఉద్యమ స్థాపనకు నడుం కట్టారు. అప్పుడు పార్టీపై నిషేదం ఉంది. అయినా వెనకడుగు వేయలేదు. వైనాడ్‌లో పేద ప్రజల ఇళ్లలో ఉండి వారి స్థితిగతుల పట్ల ప్రత్యక్ష అవగాహన ఏర్పరుచుకున్నారు. సనాతన కుటుంబంలో పుట్టినా తాను శ్రామిక ప్రజల దత్తపుత్రుడనని సగర్వంగా ప్రకటించుకున్నారు. 1939లోనే కాంగ్రెస్ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే అది కొద్దికాలమే ఉంది. ఆ స్వల్ప కాలంలోనే ఆయన బాధ్యతలలో భాగంగా కౌలురైతుల సమస్యలు అధ్యయనం చేసి వారి విముక్తికోసం ఒక నివేదిక రూపొందించారు. 1940లో కృష్ణపిళ్లె అరెస్టు కావడంతో ఇంఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. తనపై అరెసు వారంటు ఉన్నా నత్తి కారణంగా తనను గుర్తుపట్టే అవకాశం ఉన్నా సరే చివరి వరకూ రహస్య జీవితం గడిపారు. ఆ రహస్య కాలంలోనే మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలనూ సాహిత పుస్తకాలను విపరీతంగా చదివేశారు. కేరళ సమాజ స్థితిగతులు, ఆర్థిక రాజకీయాంశాలు సమగ్రంగా అధ్యయనం చేశారు.
తొలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి
1952 ఎన్నికల్లో మద్రాసు శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలైన నంబూద్రిపాద్ కొన్నేళ్లపాటు ఢిల్లీలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి పనిచేశారు. ఆ సమయంలో అనేక జాతీయ సమస్యలు, అంతర్జాతీయ సంబంధాలు ఆకళింపు చేసుకున్నారు. సదస్సులలో పాల్గొంటూ అంతర్జాతీయ అంశాల అవగాహన వివిధదేశాల ప్రతినిధులతో సంబంధాలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంతోనే 1957 ఎన్నికలలో కేరళలో కాంగ్రెస్‌ను ఓడించి తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి రాగానే భూసంస్కరణలు అమలు చేశారు. భూస్వామ్య వ్యవస్థ నడ్డివిరిచే చర్యలు చేపట్టారు. కార్మికోద్యమాలు ప్రజాందోళనల పట్ల పోలీసులు అణచివేత విధానాలు అనుసరించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ ప్రజాస్వామిక సంస్కృతి తీసుకొచ్చారు. తర్వాత కాలంలో కేరళ విద్యారంగంలో ప్రథమ స్థానంలోకి వచ్చిందంటే నాడు ఆ ప్రభుత్వం వేసిన పునాది ముఖ్యకారణం. ఎయిడెడ్, ప్రయివేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటానికి ఓ బిల్లు ప్రవేశపెట్టారు. తమ ఆధిపత్యాన్ని ఆర్థిక ప్రయోజనాలను ఏమాత్రం వదులుకోవడానికి సిద్ధపడని మత వ్యాపార వర్గాలు ఈ బిల్లుపై గగ్గోలు పెట్టాయి. నాడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఇందిరాగాంధీ తండ్రి ప్రధాని నెహ్రూ ఆశీస్సులతో విమోచన ఉద్యమం అంటూ ఈ స్వార్థపర శక్తులతో కలసి ప్రహసనం నడిపించారు. శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్న మిషతో నెహ్రూ ప్రభుత్వం 356వ అధికరణనాన్ని ఉపయోగించి ఇఎంఎస్ ప్రభుత్వాన్ని 1959లో రద్దుచేసింది. రాష్ట్రాల హక్కులపై ఆనాడు పడిన వేటు ఇప్పుడు మోడీ హయాంలో పరాకాష్టకు చేరింది. ఆ వేటుకు గురైన తొలి ప్రభుత్వం ఆయనదే కావడం దేశాన్ని అప్రమత్తం చేసింది. యాభయ్యవ దశకం మధ్యకాలం నుంచి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో పెరుగుతూ వచ్చిన సైద్ధాంతిక విభేదాలు 1962 విజయవాడ మహాసభ తర్వాత తారస్థాయికి చేరాయి. రివిజనిజంపై పోరాటం ఉధృతమైంది. అక్కడ సమన్వయ కోణంలో కార్యదర్శిగా ఎన్నికైన అజరుఘోష్ చనిపోయారు. ఆ సమయంలో అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడుగా ఇఎంఎస్ కార్యదర్శి అయ్యారు. సర్దుబాటు కోసం చైర్మన్ పోస్టు సృష్టించి డాంగేను ఎన్నుకున్నారు. ఆ క్లిష్టసమయంలో ఇఎంఎస్ ఎంతో చాకచక్యంగా బాధ్యతలు నిర్వహించారు. కానీ సయోధ్య ఎక్కువ కాలం సాగలేదు. చైనాతో సరిహద్దు సమస్యను సాకుగా చూపి కేంద్రం ఇఎంఎస్, సుందరయ్య, జ్యోతిబాసు వంటి నాయకులపై దుష్ప్రచారం చేసింది. అరెస్టు చేసింది. అయితే ఆయన ప్రపంచానికి తెలిసిన నాయకుడు గనక వ్యూహాత్మకంగా కొద్దికాలంలోనే విడుదల చేయాల్సి వచ్చింది. తర్వాత కాలంలో ఏర్పడబోయే సీపీఐ(ఎం) నాయకత్వంలో అత్యధిక భాగం జైలులో ఉన్నా నంబూద్రిపాద్ తదితరులు చాలా సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు. 1964లో ఆ పార్టీ ఏర్పడిననాటి నుంచి తొలి పోలిట్‌బ్యూరో సభ్యుడుగా, సైద్ధాంతిక మార్గదర్శకులలో ఒకడుగా ఇఎంఎస్ అసమాన ప్రజ్ఞ కనపర్చారు. 1965లో జరిగిన కేరళ ఎన్నికల్లో మరోసారి సీపీఐ(ఎం) విజయం సాధించినా ఎన్నికైన వారంతా జైలులో ఉండటం వల్ల ప్రమాణ స్వీకారం కుదరలేదు. కేంద్రం కుట్రతో ఆ కారణం చూపి ఎన్నికనే రద్దుచేసింది.
పరిపాలన.. ఉద్యమం అధ్యయనం
1967లో మళ్లీ వామపక్ష ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇంచుమించు మూడేండ్లు ఉన్న ఆ ప్రభుత్వం అంతకుముందు అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రజానుకూల కర్తవ్యాలు విధానాలు పూర్తి చేసింది. 1970లలో మరో రెండుసార్లు కేరళ శాసనసభకు ఎన్నికైనప్పటికీ ఇఎంఎస్ ప్రధానంగా సీపీఐ(ఎం) కేంద్రంలో బాధ్యతలు నిర్వహించారు. ఇందిరాగాంధీ నిరంకుశ పోకడలు పెరిగిన కాలమది. వీటిని ఎదుర్కోవడంలోనూ ఆ రాజకీయ పంథా రూపకల్పనలోనూ ఆయన ఒక ముందున్నారు. మళయాలంలో దేశాభిమాని తదితర పత్రికలతో ఆయనకు చాలా ప్రగాఢ అనుబంధం ఉంది. పీపుల్స్ డెమోక్రసీకి కూడా దీర్ఘకాలం సంపాదకులుగా వ్యవహరించారు. అత్యవసర పరిస్థితిలోనూ ఇందిర నిరంకుశపాలనను తీసుకొచ్చిన అప్రజాస్వామిక రాజ్యాంగ సవరణలనూ నిరసిస్తూ దేశమంతా విస్తారంగా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. 1977 ఎన్నికలలో ఆమె ఓడిపోయిన తర్వాత ఆయన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పదిహేనేండ్లపాటు అన్ని కీలక సందర్భాల్లో నాయకత్వం వహించారు. 1980లో కేరళలో మరోసారి వామపక్ష ప్రభుత్వం ఏర్పడినా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోకుండా అధ్యయనం ఆధారంగా సలహాలు సూచనలు అందిస్తూ అండగా నిలిచారు. 1977-19ల మధ్య కాలం దేశ రాజకీయాలలోనూ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ పరీక్షా కాలం వంటిది. దేశంలో మతతత్వ రాజకీయాల పెరుగుదల మొదలైంది. సోషలిస్టు శిబిరం విచ్ఛిన్నమైంది. ఈ రెండు విషయాల్లోనూ నంబూద్రిపాద్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేశారు. మతతత్వ శక్తులకు అవకాశం లేకుండా అడ్డుకోడం కోసం అహరహం కృషి చేశారు. కేరళ ఐక్య సంఘటన నుంచి ముస్లింలీగ్ వర్గాలు లేకుండా ఐక్యసంఘటనను లౌకిక శక్తులతో నిర్మించాలని సైద్ధాంతిక నిర్ణయానికి రావడంలో ఆయనది ముఖ్యపాత్ర అని చెప్పాలి. 1987లో ఆ విధంగానే ప్రభుత్వం ఏర్పడటానికి ఇది దారితీసింది. ఉద్యమ నిర్మాణం, సైద్ధాంతిక నిర్దేశంతో పాటు సామాజిక సంస్కరణలు స్థానిక సంస్థల పటిష్టత, ప్రణాళికాబద్దమైన అభివృద్ధి ఉండాలని నిరంతరం తపించడమే గాక అందుకు తగు పద్ధతులను కూడా తీసుకొచ్చారు. కేరళ సామాజిక సూచికలలో ముందు నిలవడానికి ఇదో ప్రధాన కారణం. ఇన్ని బాధ్యతల మధ్యనా మతిస్థిమితం లేని తన సతీమణిని శ్రద్ధగా చూసుకున్నారు. ఆయన సంతానం కూడా ఉద్యమంలో పనిచేశారు.
విజ్ఞాన సర్వస్వం
నంబూద్రిని ప్రేమించని మళయాళీ అంటూ నాకెవరూ కనిపించలేదని ప్రసిద్ధ పాత్రికేయుడు ఎఎన్ రామన్ ఒకసారి అన్నారు. ఎందుకంటే ఆయనను కేరళ రాజకీయాలలో భీష్మ పితామహుడిగా పరిగణిస్తారు. ఎకె గోపాలన్ కృష్ణపిళ్లె నంబూద్రి ఒక త్రయం. ఎన్నో ఉన్నత స్థానాలు అలంకరించడం ఎన్నో కీలకబాధ్యతలు నిర్వహించడం మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ మచ్చలేని వ్యక్తి. కార్యకర్తలకు రాజకీయ స్పష్టత నివ్వడం ఆయన ప్రథమ కర్తవ్యంగా తీసుకునేవారు. సభలో మాట్లాడినా రాసినట్టుండే ఆయన శైలి ఎన్నో ప్రసంగాలు అనువదించిన ఈ వ్యాసకర్తకు సుపరిచితం. ఇంతటి మహారథుడూ చమత్కార భాషణకూ పేరెన్నిక గన్నారు. బిబిసి విలేకరి ఒకసారి మీకు నత్తి ఎప్పుడూ ఉంటుందా’ అని ప్రశ్నిస్తే లేదు మాట్లాడేప్పుడే అని చమత్కారంగా జవాబిచ్చారు. ‘విపి సింగ్ ప్రభుత్వం మరెన్ని రోజులుంటుందని విలేకరి ప్రశ్నిస్తే ‘ఊహాగానాలు నాపని కాదు. మీ పత్రికల గుత్తసొమ్ము’ అని ఠక్కున సమాధానం. ఇందిరాగాంధీ హయాంలో ఒకసారి జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ఎందుకో థాంక్‌గాడ్ అన్నారట. పక్కనే ఉన్న ఒక కేంద్రమంత్రి ‘మీకు దేవుడిపై నమ్మకం ఎప్పుడు ఏర్పడిందని’ ఎగతాళి చేయబోయారు. ‘అబ్బే నాకు దయ్యాలను చూసినప్పుడల్లా దేవుడు గుర్తుకు వస్తాడని’ ఎదురువడ్డించారు నంబూద్రిపాద్. తన ఆత్మకథకు మళయాలంలో ఉత్తమ గ్రంథంగా పురస్కారం లభించింది. జీవితం చరమ దశలో మరోసారి దేశాభిమాని గౌరవ సంపాదక బాధ్యతలు స్వీకరించి చివరివరకూ రచనలు కొనసాగించారు. ఆయన కన్నుమూసే రోజున కూడా మరుసటి రోజు దేశాభిమాని పత్రికలో రాయాల్సిన వ్యాసం పూర్తిచేసి ఉంచారట! ఇంతటి మహోన్నత ప్రజాపుత్రుడు, విజ్ఞాన సర్వస్వం 1998 మార్చి 19న తిరువనంతరపురంలో కన్నుమూశారు. రాజకీయ భేదాలకు అతీతంగా దేశమంతా ఆయనకు నివాళులర్పించింది. కరుడు కట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకి ఎల్‌కె అద్వానీ తన ఆత్మకథలో.. హోంమంత్రిగా తాను చేసిన మొదటిపని నంబూద్రిపాద్‌కు నివాళులర్పించడమేనని రాసుకోవడం ఇందుకు నిదర్శనం. 2009లో ఆయన శతజయంతి ఘనంగా జరిగింది. ఆయన స్మారకార్థం నిర్మించిన ఇఎంఎస్ అకాడమీ తన వారసత్వానికి తగినట్టే సాంస్కృతిక రాజకీయ అధ్యయనాలకు కేంద్రంగా విరాజిల్లుతున్నది. ఆ కేంద్రంలో మూలమూలనా నంబూద్రిపాద్ నిలువెత్తు చిత్రాలు ఆయన స్ఫూర్తిని సజీవంగా నిలుపుతున్నాయి.
(నేడు ఇఎంఎస్ 25వ వర్థంతి)
– తెలకపల్లి రవి