అధికారులు మారినా.. మారని పేర్లు 

Even if the officers have changed.. the names have not changed– నిర్లక్ష్యం పై మండిపడుతున్న ప్రజలు

– తప్పు దోవ పట్టించాలనే ఇలా చేస్తున్నారని సామాజిక కార్యకర్తల ఆరోపణ 
– పేర్లు వెంటనే మార్చాలని డిమాండ్ 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజకుమారి గత జూన్ 23న బదిలీపై గాంధీ మెడికల్ కళాశాల సూపర్డెంట్ గా వెళ్లి సుమారు మూడు నెలలు గడిచింది. ఆమె స్థానంలో మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన హెచ్ ఓ డి డాక్టర్ రాధాకృష్ణ నెల రోజులు బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పాతాలజి విభాగానికి చెందిన హెచ్ ఓ డి డాక్టర్ శ్రీవాణి ప్రస్తుతం ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్నారు. అయినప్పటికీ మెడికల్ కళాశాల సమాచార హక్కు చట్టం – 2005 బోర్డుపై ఇంకా పేరు మారలేదు. నేటికీ అప్పిలేట్ అధికారి డాక్టర్ రాజకుమారి అనే ఉంది. అదేవిధంగా సహాయ సమాచార అధికారి పేరు కూడా నేటికీ మార్చలేదు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆఫీసు సూపర్డెంట్ అయినా ఎంఏ. సలాం మెడికల్ కళాశాలలో గత ఐదు నెలల క్రితం వరకు విధులు నిర్వర్తించి తిరిగి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆఫీసు సూపర్డెంట్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. కాగా ఆ బాధ్యతలను మెడికల్ కళాశాల సూపర్డెంట్ అయిన శ్రీలత కు ఇచ్చారు. అయితే అధికారులు మారి నెలలు గడిచిన సమాచార హక్కు చట్టం – 2005 బోర్డుపై పేర్లు మార్చకపోవడం పట్ల జిల్లా ప్రజలు, సామాజిక కార్యకర్తలు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు ప్రభుత్వ మెడికల్ కళాశాల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన లేకనా.. లేదా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అధికారులు కావాలనే ఇలా చేస్తున్నారా అని మండిపడుతున్నారు. ఇలా అయితే ప్రజలకు అధికారులకు తత్స సంబంధాలు ఎలా కొనసాగుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మెడికల్ కళాశాల అధికారులు తక్షణమే సమాచార హక్కు చట్టం – 2005 బోర్డుపై అధికారుల పేర్లను మార్పు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్లు మాత్రమే అందులో ఉంచాలని కోరుతున్నారు.