జాతీయ టీవీ ప్రముఖుడైన రాజ్‌దీప్ సర్దేశాయిని మరోమీడియా ప్రముఖుడైన కరణ్ థాపర్ ఇటీవల ఇంటర్వ్యూ చేశారు. దక్షిణ భారత దేశంలో కొన్ని రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరపాలంటూ వస్తున్న ప్రతిపాదనపై ఏమంటారని కరణ్ ప్రశ్నించారు. అసలు పార్లమెంటు అనేది సక్రమంగా నిర్వహించితే కదా ఎక్కడ పెట్టాలనేది ఆలోచించడానికి? అని రాజ్‌దీప్ ఎదురుప్రశ్న వేశారు. ప్రధాని మోడీ అసలు సభలకు వస్తున్నారా? లోతుగా చర్చ జరిగిన అంశాలపై సమాధానాలు ఇస్తున్నారా? అదే లేనప్పుడు ఉత్తర దక్షిణ మీమాంస ఏముందని అడిగారు. గతవారం రోజులుగా లోక్‌సభ రాజ్యసభ తీరుతెన్నులు గమనించే వారెవరికైనా కలిగే సందేహమే ఇది. ఎప్పుడు మొదలై ఎప్పుడు వాయిదా పడిపోతున్నాయో..ఎంత మొక్కుబడిగా ఏకపక్షంగా ముగిసిపోతున్నాయో చూస్తుంటే ఒకప్పుడు దేశమంతా ఎదురుచూసిన ఉన్నతస్థాయి సభలు ఇవేనా అనే అనుమానం వస్తుంది. పెద్ద నోట్ల రద్దు నుంచి కాశ్మీర్ 370 రద్దు వరకూ ఎంత తీవ్రమైన మౌలికమైన అంశమైనా సరే ఎదురు దాడి తప్ప మరే ధ్యాస లేనట్టు వ్యవహరిస్తున్న బీజేపీ-ఎన్డీయే వైఖరి చూస్తే మోడీకి అసలు ఈ పార్లమెంటు అంటేనే నచ్చదని స్పష్టమవుతుంది. దానికి తగినట్టే గత పాతికేళ్లలో బీజేపీ అధ్యక్ష తరహా గురించి అనేకసార్లు చర్చకు పెట్టింది.ఇప్పుడు కూడా రాజ్యాం గంపై రెండురోజుల చర్చ చేస్తామంటున్నారు గనక ఆ సందర్భంలో మళ్లీ ఇది ముందుకు వచ్చే అవకాశముంది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ మంత్ర జపం వాస్తవానికి ఆదిశలో కేంద్రీకృత పాలన తీసుకువచ్చే కుట్రలో ఒక అడుగు మాత్రమేనని గ్రహించాల్సి వుంది. ప్రజలకూ దేశానికీ అవసరమైన రాజకీయంగా ప్రతికూలమైన అంశాలను దాట వేయడం, ప్రతిపక్షాల పీక నొక్కడం మోడీ హయాంలో పరిపాటిగా మారింది. కాకపోతే ఈ సభల్లో మరో అడుగు ముందుకేసి ప్రతిపక్షాల విమర్శకు రివర్స్‌గా తామొక పోటీ ఎజెండా తీసుకురావడం చూస్తున్నాం.
నమో అదానీ..అదే కహానీ
ఈ సమావేశాలకు కొంచెం ముందుగానే అమెరికా న్యాయశాఖ అదానీ గ్రూపునకు సంబంధించిన అదానీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లంచాల భాగోతం బయటపెట్టింది. ఆ దేశ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్(సెక్) కూడా ఆ కంపెనీ విదేశాలలో అవినీతి కార్యకలాపాలపై వాస్తవాలను దాచిపెట్టిందని కేసులో పేర్కొంది. అమెరికా చట్టాలను ఉల్లంఘించినందుకు గాను వారు ఈ విషయం బయటకు తీసుకొచ్చినా నిజానికి దీని ప్రభావం ఎక్కువగా పడింది ఇండియాపైనా, అందులో ఏపీపైనా, పైగా అదానీ కంపెనీ అక్రమాలపై అంతర్జాతీయ స్థాయిలో రభస రేగడం ఇది మూడోసారి. గత రెండుసార్లలాగే ఇప్పుడు కూడా మోడీ సర్కారు ఈ విషయమై గప్‌చిప్‌గా వుండిపోయింది. పైగా ఇది తమ కేంద్రానికి సంబంధంలేని ప్రయివేటు వ్యవహారమని తప్పుకోజూసింది. కేంద్ర సంస్థ సెకీ, అప్పుడు సంతకాలు చేసిన ఏపీ ప్రభుత్వం,ముడుపులు లబ్ది పొందినట్టు చెబుతున్న ఏపీ నెంబర్‌వన్ ఇవేవీ ఈ దేశానికి సంబంధం లేనివి కావే? ఈఒప్పందాలు జరగలేదనీ వారెవరూ చెప్పడం లేదే? అదానీ ఎదుగుదలతో ఆమూలాంతం ముడిపడిన పాలనా కాలం మోడీదే. దీంతో ఆయనకు కాకపోతే మరెవరికి సంబంధముంటుంది? పైగా సెకీ కేంద్ర సంస్థగానే రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తుంది గనక ఆరీత్యా కూడా బాధ్యత వహించాల్సింది కేంద్రమే కదా? ఇవన్నీ తెలుసు గనకే పార్లమెంటులో ఈ అంశంపై చర్చ దాటేయడానికి అడుగడుగునా ప్రభుత్వం అడ్డుపడింది. మూడు రోజులు ఈ అంశంపై వివాదంతోనే గడిచిపోయింది. ఈ లోగా బీజేపీయేతర పార్టీలు కూడా కొన్ని చర్చకోసం పట్టు పట్టకుండా తప్పుకోవడానికి ప్రయత్నించా యంటే అదానీల ప్రభావం ఎంతో తెలుస్తుంది. ఇదే సమయంలో సభ వెలుపుల బీజేపీ నేతలు మంత్రులు వారిని నడిపించే ఆరెస్సెస్ బాసులు కూడా అదానీపై ఆరోపణలు ఉద్దేశపూర్వకమైనవని ఎదురుదాడి మొదలుపెట్టారు. మీడియాలో వ్యాసాలు రాయించారు. ఇది దేశంపైనే కుట్ర అని పల్లవి ఎత్తుకున్నారు. పార్లమెంటు సలహా సంఘం సమావేశంలో తర్జనభర్జనల తర్వాత రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ జరుపుదామని మధ్యే మార్గంలో ఒక ఒప్పందానికి వచ్చారు. రాజ్యాంగం 75వ వార్షికోత్సవమంటూ ఏకపక్షంగా జరిపేసిన ధోరణినుంచి మోడీ సర్కారు దిగిరావలసి వచ్చింది.అయితే తీరా చర్చలో వారి కోణం ఏమి టనేది వాస్తవంగా చూడాల్సిందే. కాగా కేంద్రం నిరంకుశపోకడలు నిరసించడం ప్రతిపక్షాల ఎజెండాగా వుండొచ్చు.
ప్రతిపక్షాల కుట్రా?
ఏదో ఒక చర్చకు మార్గం సుగమమైందని సంతోషించేంతలో బీజేపీ ప్రతిపక్ష నేతపైనే అతి పెద్ద దేశద్రోహి ముద్రతో రభస సృష్టించడం పరిశీలకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఒసిసిఆర్‌పి) అదానీపై తీవ్ర ఆరోపణలు తీసుకురావడం వెనక భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్ర చేస్తున్న శక్తులు దాగివున్నాయని బీజేపీ నేత సంబిత్‌పాత్ర పాట ఎత్తుకున్నారు. వీరిని ప్రోత్సహిస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ దేశానికి ద్రోహి నెంబర్‌వన్‌గా వున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై సభ వెలుపల ఇంత ఆరో పణ చేయడాన్ని లోక్‌సభ పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు లేఖ రాసింది. మరో వంక కాంగ్రెెస్ వామపక్షాలు, మరికొన్ని లౌకిక పార్టీలు మొహాలకు తొడుగులు వేసుకుని సభాప్రాంగణంలో నిరసన తెలిపాయి.అదానీ వ్యవహారాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుపట్టాయి.అదే సమయంలో బీజేపీ తమ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో వరుసగా పోస్టులతో ఈ ఆరోపణలు కొనసాగించింది. జార్జి సొరేస్ అనే శతకోటీశ్వరుడు అమెరికా విదేశాంగ శాఖతో కలసి భారతదేశానికి వ్యతిరేకంగా సాగించే కుట్రలో భాగంగానే ఒసిసిఆర్‌పి నడిపిస్తున్నారనీ, దాని ఖర్చులో సగం ఆయనే భరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ నాలుగేండ్లలో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రతి అంశం కూడా ఈ శక్తుల నుంచి వచ్చినవాటి ఆధారంగానే నడిచిందని పేర్కొంది.
విచిత్రమేమంటే వామపక్షాలు, కార్మికసంఘాలు, సమాంతర మీడియా కాంగ్రెస్‌తో నిమిత్తం లేకుండా అనేక తీవ్ర విమర్శలు చేశాయి. ప్రపంచీకరణ ముసుగులో సాగుతున్న కార్పొరేట్ భాగోతాలను బహిర్గతం చేశాయి.అయితే లౌకిక వామపక్షాల నిరసనలపై స్పందించకుండా కాంగ్రెస్‌ను ముందుపెట్టి దాడి చేయడం బీజేపీ-ఆరెస్సెస్‌ల కీలక వ్యూహం. గతంలో వైర్, న్యూస్‌క్లిక్ వంటి సంస్థలపై దాడి చేసినప్పుడు ఇదే తరహా ఆరోపణలు మరో విధంగా తీసుకువచ్చిన సంగతి గుర్తుండేవుంటుంది. (ప్రణరు రారు దంపతుల ఎన్డీటీవీని హస్తగతం చేసుకోవడానికి కూడా బూటకపు ఆరోపణలతో ఒత్తిడి తెచ్చి అన్నీ తమకు రాయించేసుకున్నాక ఇప్పుడు ఆ కేసులు కొట్టేశారట!) ఏదైతేనేం విశ్వగురుగా అందరూ తమను పొగుడుతున్నారని టముకు వేసుకున్నప్పుడు ఇదే అమెరికా, పాశ్చాత్యదేశాల సంస్థలు గొప్పవైపోతాయి. పెగాసస్, కులగణన, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, ప్రపంచ ఆకలిసూచీ లెక్కలు, మత స్వేచ్ఛలపై వేటు,మీడియాపై దాడి ఇలా వచ్చిన ఆరోపణలన్నీ కుట్రలో భాగంగా తీసుకొస్తున్నారట.
అదానీ కోసం అభాండాలా?
2020 నవంబర్ 13న బ్రిటిష్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ గౌతం అదానీ మోడీకి రాక్‌ఫెల్లర్‌లా పనిచేస్తున్నాడని, అదానీని దెబ్బతీస్తేగానీ మోడీని ఎదుర్కొవడం సాధ్యం కాదని రాసిందట. 2023లో జి20 సమావేశాలకు కాస్తముందుగా రాహుల్‌గాంధీ అదానీ సమస్యను ముందుకు తెచ్చి మోడీపై దాడి కేంద్రీకరించాడట.ఇక్కడ అదానీ సాకు మాత్రమేననీ మోడీపైనే దాడి అని బీజేపీ పోస్టు చిత్రిస్తున్నది. పెగాసస్ అంశం కూడా ఒసిసిఆర్‌పినే నివేదించింది గనక దాన్నీ అదానీ సమస్యనూ కూడా కుట్రగా చూపించే ప్రయత్నం చేస్తున్నది.ఇంతా చేసి ఈ ప్రత్యా రోపణకోసం బీజేపీ ఉటంకించేది మీడియా పార్ట్ అనే ఫ్రెంచి పరిశోధనాత్మక సైట్‌ను మాత్రమే, రాఫెల్ కుంభకోణంపై అదే మీడియా పార్ట్ వెల్లడించిన అంశాలను బీజేపీ తిరస్కరించింది. అమెరికాతో అంతగా చేతులు కలిపే ఈ సర్కారు దాని విదేశాంగ శాఖను కూడా వ్యతిరేకుల జాబితాలో కలపడం జో బైడెన్ పాలన ముగియలేదు గనకే. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ట్రంప్ హయాంలో క్వాడ్ ద్వారా తమకు చాలా మేలు జరిగిందనిచెప్పడం కూడా కలిపి చూస్తే మోడీ ప్రభుత్వ వ్యూహం అర్థమవుతుంది. ‘ఎక్స్’లో పోస్టుతోనే ఆగకుండా బీజేపీ ఎంపీ నిశికాంత దూబే లోక్‌సభలోనూ ఇదే విధమైన తీవ్రారోపణలు చేశారు.అధ్యక్ష స్థానంలోని బీజేపీ ప్యానల్ స్పీకర్ దిలీప్ సైకియా ఆగిపోయిన దూబే ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా ప్రత్యేకంగా అనుమతినిచ్చారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఎంతగా నిరసన తెలిపినా పెడచెవిన పెట్టారు.ఈలోగా అదానీపై, సెకీపై మరిన్ని కథనాలు వచ్చాయి. ప్రత్యేకంగా వారు సౌర విద్యుత్ తక్కువ రేట్లకు సరఫరా చేసే అవకాశం కలిగించడానికే సెకీ విద్యుత్ సరఫరా చార్జీలు(ఐఎస్‌టిఎస్) మినహాయించడానికి ఒప్పుకుంది. 2021నవంబరు 30న ఈ నిర్ణయం ప్రకటించడం, డిసెంబరు1న జగన్ సర్కారు ఒప్పందంపై సంతకాలు చేయడం శరవేగంగా జరిగిపోయాయి. ఇప్పటికీ ఆ ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసుకోకపోగా మరింత వ్యవధినిచ్చింది. కనుక ఎన్‌డిఎ విధానం లోగుట్టు ఏమిటో కండ్లకు కట్టినట్టు కనిపిస్తూనే వుంది.దీన్ని దాచిపెట్టడం కోసం ప్రతిపక్షాలు దేశద్రేహానికి పాల్పడినట్టు అభాండాలు వేస్తూ ఆదానీ రక్షణ కోసం తాపత్రయపడటం మోడీకే చెల్లింది.అమెరికా కోర్టులో విచారణ కూడా మొదలైంది.
వెలుపలా కూడా
రాజ్యసభలోనూ ఇదేతంతు కొనసాగుతోంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మనుసింఘ్వి కూచునే సీటులో 500 రూపాయల నోట్ల దొంతి దొరికిందంటూ సభాపతి జగదీప్ ధంకర్ ఉన్నఫలాన ప్రకటించడం అభ్యంతరాలకు దారితీసింది. ఏదైనా వుంటే విచారించి చెప్పాలి గాని ఇలా ఎందుకు చేశారనేది సందేహాలకు దారితీసింది. ఏపీకి సంబంధించిన విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలోనూ ఉక్కుగనుల శాఖామంత్రి కుమారస్వామిగౌడ తనే చేసిన ప్రకటనను మర్చిపోయి పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగుతున్నదని వివరించారు. పలు సందర్భాల్లో బీజేపీ-ఎన్డీయే మంత్రులు, సభ్యులు ప్రతిపక్షాలపై విరుచుకుపడటం దాడి చేయడం కనిపిస్తున్నది. మరోవంక ప్రతిపక్షాలు మాత్రం సమస్యలు దాటవేసే ప్రయత్నాలను అడ్డుకుంటూనే వున్నాయి. ఈ అందోళనలు కూడా విదేశీ ప్రేరేపితమని లోగడనే పాలకపక్షం ఆరోపించింది. ఇదే తరుణంలో సభ బయట రైతాంగ ప్రదర్శనను అణచివేయడానికి కూడా కేంద్రం రంగంలోకి దిగింది.మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫఢ్నవిస్ కూడా ప్రతిపక్షాలకు మీడియా సంస్థలకూ విదేశీ సాయంపై తన దగ్గర ఆధారాలున్నాయని రిపబ్లిక్ టీవీకి చెప్పడం గమనించదగింది. కనుక అదానీ రక్షణ కోసం కేంద్రం ఎంతదూరం వెళ్తుందో వీటన్నిటినీ బట్టి గ్రహించవచ్చు. రాజ్యాంగ చర్చలో ఇవి పరాకాష్టకు చేరినా ఆశ్చర్యం లేదు.
– తెలకపల్లి రవి