నమో అంటే…నమ్మించి మోసం చేయడమే

Namo means...to deceive by trusting– పదేండ్లలో తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం
– విభజన చట్టంలోని హామీలేమయ్యాయి?
– ఏం మొహం పెట్టుకుని బీజేపోళ్లు ఓట్లు అడుగుతారు?
– అధికారంలోకొచ్చేది ఇండియా కూటమే
– చూస్తూ ఊరుకోవడానికి జానారెడ్డిని కాదు రేవంత్‌రెడ్డిని
– కేసీఆర్‌..ఎక్కువ చేస్తే చర్లపల్లి జైలుకే : సీఎం రేవంత్‌రెడ్డి
– బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం తుక్కుగూడలోని రాజీవ్‌గాంధీ మైదానంలో జరిగిన జనజాతర బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. తమ పార్టీ జాతీయస్థాయి ఎన్నికల మ్యానిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి రాహుల్‌గాంధీ ఆవిష్కరించడం గర్వకారణమన్నారు. సోనియాగాంధీ ఇదే గడ్డ మీద నుంచి ఆరు గ్యారెంటీలిచ్చి రాష్ట్రంలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించారని గుర్తుచేశారు. ఇప్పుడు జాతికి ఐదు గ్యారెంటీలను రాహుల్‌గాంధీ అంకితం చేశారని కొనియాడారు. జూన్‌ నాలుగో తేదీన వెలువడే ఫలితాల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నదని ఆశాభావం వ్యక్తంచేశారు. జూన్‌ 9న ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి, దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణానది పోటెత్తి సునామీని సృష్టిస్తే ఎలా ఉంటుందో తుక్కుగూడ కాంగ్రెస్‌ శ్రేణుల సంద్రం అలా ఉందన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కదం తొక్కితే బీఆర్‌ఎస్‌ కనిపించడకుండా పోయిందనీ, బీజేపీని కూడా తుక్కుతుక్కుగా తొక్కడానికి తుక్కుగూడకు వచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులకు ధన్యవాదాలు అని చెప్పారు. కాంగ్రెస్‌ బలం, పునాది కార్యకర్తలేననీ, వారి కష్టంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. మోడీ గుజరాత్‌ మోడల్‌పై తెలంగాణ మోడల్‌ ఆధిపత్యాన్ని చూపించబోతున్నదని నొక్కి చెప్పారు. పదేండ్లుగా ప్రధాన మంత్రిగా ఉన్న మోడీ ఏటా రెండు కోట్ల చొప్పున పది కోట్ల ఉద్యోగాలివ్వలేదని విమర్శించారు. పార్లమెంట్‌లో ఇదే అంశంపై తాను ప్రశ్నిస్తే కేవలం 7 లక్షల ఉద్యోగాలనే మోడీ ప్రభుత్వం ఇచ్చిందని తేలిందన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకు మోడీకి ఓటేయ్యాలా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోసం చేసినందుకు మోడీకి ఓటెయ్యాలా? నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్నందుకు ఓటెయ్యాలా? కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించనందుకు ఓటెయ్యాలా? 2022 నాటికి ప్రతి పేదవాడికీ ఇండ్లు కట్టిస్తానని మాటతప్పినందుకు ఓటెయ్యాలా? మతం, కులం, ప్రాంతం, భాషల పేరుతో ప్రజలను విభజించినందుకు మోడీకి ఓటెయ్యాలా? ఓట్ల కోసం దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత్‌లుగా విభజించి చూపుతున్నందుకు ఓటెయ్యాలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అకాల వర్షాలతో హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైతే సికింద్రాబాద్‌ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి ఒక్క పైసానైనా తెచ్చారా? ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అని నిలదీశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఐటీఐఆర్‌, బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను పదేండ్లలో కాలంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణలోని కీలకమైన ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన బీజేపీకి బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సూర్యాపేట, కరీంనగర్‌కు పోయి మాజీ సీఎం హోదాలో కేసీఆర్‌ వెంట్రుక కూడా పీకలేరని మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పదేండ్ల కాలంలోనే వందేండ్ల విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. అధికారం పోయింది, కాలు విరిగింది, కూతురు జైలుకు పోయింది కాబట్టి బాధలో ఉన్నప్పుడు ఆయనపై విమర్శలు చేయొద్దని ఇంత కాలం సమన్వయం పాటించామని సీఎం అన్నారు. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి, వినడానికి తాను జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డినని చెప్పారు. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే అంగిలాగు ఊడదీసి చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు. పదేండ్ల కాలంలో పేదలకు డబుల్‌ బెడ్‌ ఇండ్లు మీరు ఇవ్వకపోవచ్చుగాని కేసీఆర్‌ మీ కోసం చర్లపల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ కట్టిస్తానని హామీనిచ్చారు. ఎందుకంటే చర్లపల్లి జైలులో మీరు, మీ బిడ్డ, కొడుకు, అల్లుడు వస్తే ఉండనీకి డబుల్‌ బెడ్‌ రూమ్‌ కావాల్సిందేనన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన చోట తాము ఓట్లు అడుగుతామనీ, కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టించిన దగ్గర అడుక్కోవాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్ల పనులను రూ. 22,500 కోట్లతో ప్రారంభించామని తెలిపారు. కడుపుకట్టుకుని రాష్ట్ర ప్రజల కోసం రోజుకు 14 గంటలు పనిచేస్తున్నామనీ, తెలంగాణలో కాంగ్రెస్‌ను కనీసం 14 సీట్లలో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హెలిక్యాప్టర్‌లో తిరుగుతూ, విదేవీ పర్యటనలు చేస్తూ .గంటకో డ్రెస్‌ మార్చే మోడీని గెలిపించొద్దనీ, ప్రజల కోసం దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీ పరివారంపై రాహుల్‌గాంధీ పరివారం విజయం తథ్యమన్నారు.
ఆర్థిక, విద్యుత్‌ సంక్షోభాన్ని సృష్టిస్తే.. గాడిలో పెడ్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక, విద్యుత్‌ సంక్షోభాన్ని సృష్టించి సుడిగుండంలా చేసి పోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెండు వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలిస్తున్నామన్నారు. రాహుల్‌గాంధీ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. నరేగా కింద రూ.400 వేతనం ఇస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. తెలంగాణ మోడల్‌గా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పార్లమెంట్‌ స్థానాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.